Weather Color Alerts: ప్రకృతి ప్రకోపించినప్పుడు ప్రాణాలను, ఆస్తులను కాపాడుకోవడానికి వాతావరణ శాఖ జారీ చేసే హెచ్చరికలే ఈ ‘కలర్ కోడెడ్ అలర్ట్స్’. ఆకాశం మేఘావృతమై, భారీ వర్షాలు కురుస్తాయని ముందే ఊహించి, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ రంగులను వాడుతుంటారు. అసలు ఈ అలర్ట్స్ వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, ఏ ప్రాతిపదికన వీటిని ఇస్తారో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
వాతావరణంలో వచ్చే తీవ్రమైన మార్పుల వల్ల ప్రజల సాధారణ జీవనానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూడటమే ఈ అలర్ట్స్ ముఖ్య ఉద్దేశం. కేవలం వర్షాలే కాదు.. ఎండ తీవ్రత (హీట్ వేవ్స్), చలిగాలులు, తుపాన్లు వచ్చినప్పుడు కూడా భారత వాతావరణ శాఖ (IMD) ఈ రంగుల హెచ్చరికలను జారీ చేస్తుంది. ప్రమాదం తీవ్రతను బట్టి ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సులభంగా అర్థం కావడానికి ఈ కలర్ కోడింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు.
ప్రాథమికంగా వాతావరణ శాఖ నాలుగు రకాల రంగులను ఉపయోగిస్తుంది. రంగును బట్టి వాటి తీవ్రత ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.
దీని అర్థం వాతావరణం సాధారణంగానే ఉంటుంది. ఇకపై ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేందుకు అధికారులు దీనిని జారీ చేస్తుంటారు. ఇది జారీ చేసినప్పుడు ప్రజలు తమ పనులను ఎంచక్కా చేసుకోవచ్చు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పడానికి ఇది సంకేతం.
రాబోయే కొన్ని రోజుల్లో వాతావరణం మారే అవకాశం ఉందని, భారీ వర్షాలు పడొచ్చని చెప్పడానికి దీన్ని ఇస్తారు. ఇది ఒక రకమైన ముందస్తు హెచ్చరిక లాంటిది. ‘పరిస్థితిని గమనిస్తూ ఉండండి, అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేసుకోండి’ అని ఈ సిగ్నల్ అర్థం.
వాతావరణం మరింత క్షీణించి, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పుడు దీన్ని జారీ చేస్తారు. దీనివల్ల రోడ్లు బ్లాక్ అవ్వడం, విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రవాణా వ్యవస్థకు అంతరాయం కలగడం వంటివి జరుగుతాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, అధికారులు సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని దీని అర్థం.
ఇది అత్యంత ప్రమాదకరమైన హెచ్చరిక. అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసి, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ ఇస్తారు. ఈ అలర్ట్ జారీ చేసినప్పుడు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగాలని ఈ అలర్ట్ హెచ్చరిస్తుంది.
ప్రధానంగా ఈ కలర్ అలర్ట్స్ ను వాతావరణ శాఖ ఇస్తుంది. అయితే కేవలం వర్షం పరిమాణాన్ని బట్టే కాకుండా అనేక సాంకేతిక, భౌగోళిక అంశాలను విశ్లేషించి వీటిని జారీ చేస్తుంది. అవి ఏంటంటే..
24 గంటల్లో ఎంత మిల్లీమీటర్ల వర్షం పడొచ్చు అనేదానిపై ప్రధానంగా ఆధారపడి కలర్ అలర్ట్స్ వాతావరణ శాఖ జారీ చేస్తుంది. ఉదాహరణకు 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంటే ‘రెడ్ అలర్ట్’ ఇస్తారు.
ఒకే రకమైన వర్షం ఉన్నప్పటికీ.. ప్రాంతాన్ని బట్టి ఈ అలర్ట్స్ మారుతూ ఉండొచ్చు. మైదాన ప్రాంతాల్లో పడే వర్షం, కొండ ప్రాంతాల్లో పడే వర్షం ఒకేలా ఉన్నప్పటికీ.. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి.. మైదన ప్రాంతాలకు సాధారణ ఎల్లో అలర్ట్ ఇచ్చి.. కొండ ప్రాంతాలకు మాత్రం ఒక్కోసారి అరంజ్, రెడ్ అలర్ట్స్ ను వాతావరణశాఖ జారీ చేస్తుంటుంది.
రాడార్లు, ఉపగ్రహాల (Satellites) ద్వారా వచ్చే డేటాను కూడా ఈ అలర్ట్ జారీకి పరిగణలోకి తీసుకుంటారు. ముఖ్యంగా గాలిలోని తేమను, మబ్బుల సాంద్రతను శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షించి.. ప్రజలను అప్రమత్తం చేస్తుంటారు.
వాతావరణశాఖ గత అనుభవాలను సైతం పరిగణలోకి తీసుకొని.. ఈ అలర్ట్స్ ను జారీ చేస్తుంటుంది. పడబోయే వర్షాన్ని ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ తట్టుకోగలదా? వరదలు వచ్చే ఛాన్స్ ఉందా? అనే ఇంపాక్ట్ అసెస్‌మెంట్ (Impact Assessment) ఆధారంగా కూడా ఈ రంగులను ఖరారు చేస్తారు.
Also Read: చౌకైన పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్.. జియో రూ. 349 vs వీఐ రూ. 449.. ఏది బెస్ట్ అంటే?
మెుత్తంగా చెప్పాలంటే.. వాతావరణం అనేది ఎప్పటికప్పుడు మార్పునకు లోనయ్యే ప్రక్రియ. అందుకే శాస్త్రవేత్తలు శాటిలైట్ డేటాను బట్టి ఎల్లో అలర్ట్‌ను ఆరెంజ్‌గా, ఆరెంజ్‌ను రెడ్‌గా మారుస్తూ అప్‌డేట్స్ ఇస్తుంటారు. కాబట్టి వర్షాకాలంలో ఈ అలర్ట్స్‌ను గమనిస్తూ అప్రమత్తంగా ఉండటం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read:ప్రపంచంలోనే తొలిసాలి.. రోబోలతో లైవ్ సర్జరీ.. ఆపరేషన్ సూపర్ సక్సెస్!