India Passport Ranking 2026: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ ఏ దేశానికి ఉందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో విడుదలైన గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ 2026 పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ ఏడాది విడుదలైన లేటెస్ట్ ర్యాంకింగ్స్ లో ప్రపంచంలోని టాప్-10 శక్తివంతమైన పాస్‌పోర్ట్ లలో తొమ్మిది యూరప్ దేశాలు దక్కించుకున్నాయి. భారత పాస్ పోర్టు ర్యాంక్ మరింత పడిపోయింది. ఇంతకీ టాప్ 10లో నిలిచిన దేశాలు ఏవనేది ఇప్పుడు చూద్దాం..
ఈ జాబితాలో స్వీడన్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలు, మంచి జీవన ప్రమాణాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం లాంటి అంశాల్లో మంచి ప్రదర్శనతో స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. స్వీడన్ తర్వాత స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, జర్మనీ వరుసగా రెండో, మూడో, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. ఐదో స్థానాన్ని నెదర్లాండ్స్, డెన్మార్క్ కలిసి పంచుకున్నాయి. ఆ తర్వాత ఐర్లాండ్, యునైటెడ్ కింగ్ డమ్, నార్వే ఉన్నాయి. యూరప్ కు చెందని దేశాల్లో సింగపూర్ మాత్రమే టాప్-10లో చోటు సంపాదించింది.
సాంప్రదాయ పాస్ పోర్ట్ ర్యాంకింగ్స్ ప్రధానంగా వీసా ఫ్రీ ప్రయాణాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుంటాయి. అయితే, గ్లోబల్ పాస్ పోర్ట్ ఇండెక్స్ మాత్రం కొంచెం భిన్నంగా ఉంటుంది. ఒక పాస్ పోర్ట్ తో ఎన్ని దేశాలకు వెళ్లవచ్చనే విషయంతో పాటు, ఆ దేశ పౌరులకు విదేశాల్లో ఉద్యోగాలు, పెట్టుబడులు, జీవన ప్రమాణాలు ఎంత మెరుగ్గా ఉంటుందో కూడా అంచనా వేస్తుంది. ఇందుకోసం మొత్తం 14 అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది.
భారత్ కు ఈ ర్యాంకింగ్ లో ఆశించిన స్థానం దక్కలేదు. గ్లోబల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2026లో భారత్ 200 దేశాల్లో 125వ స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాల విషయంలో భారత పాస్‌పోర్ట్ ఇంకా చాలా దేశాల కంటే వెనుకబడి ఉందని ఈ నివేదిక వెల్లడించింది. అటు మరో ప్రముఖ ర్యాంకింగ్ సంస్థ అయిన హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ లో కూడా భారత్ వెనుకబడింది. తాజా లిస్టు ప్రకారం భారత పాస్ పోర్ట్ 80వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారతీయ పాస్ పోర్ట్ కలిగిన వారు 56 దేశాలకు వీసా ఫ్రీ, వీసా ఆన్ అరైవల్ సౌకర్యంతో ప్రయాణించే అవకాశం ఉంటుంది. వీటిలో ఎక్కువగా ఆసియా, ఆఫ్రికా, కరేబియన్, పసిఫిక్ ప్రాంతాలకు చెందిన దేశాలు ఉన్నాయి. అయితే అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్ తో పాటు చాలా యూరోపియన్ దేశాలకు వెళ్లాలంటే భారతీయులు ఇప్పటికీ ముందుగానే వీసా తీసుకోవాల్సి ఉంటుంది.
Read Also: చెన్నై ఎయిర్ పోర్ట్.. ఇండిగో ఎయిర్ లైన్స్.. ఆన్ టైమ్ పర్ఫార్మెన్స్ లో అదరగొట్టాయిగా!