Bandi Sanjay: స్వేచ్ఛ బ్యూరో : చెడు మార్గంలో వెళ్లేవారికి ఎప్పటికీ విజయం దక్కదని, చివరికి మంచే గెలుస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొరపాట్లు చేసేవారు ఇప్పటికైనా తమ ప్రవర్తన మార్చుకుని, ఇతరులకు సేవ చేసే గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు. అలా నడుచుకునే వారిపైనే అమ్మవారి కరుణాకటాక్షాలు ఉంటాయని, మహిషాశుర మర్ధిని చరిత్ర కూడా మనకు ఇదే సందేశాన్ని ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.
మహాశక్తి ఆలయంలో ప్రత్యేకాభిషేకాలు, చండీ యాగం
దేవీ నవరాత్రి ఉత్సవాల చివరి రోజైన సోమవారం, కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారు మహిషాశుర మర్ధిని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తిశ్రద్ధలతో చేపట్టిన చండీ యాగం, హోమంలో పాల్గొన్న అనంతరం ఆయన తన భవానీ దీక్షను విరమించారు.
ఘనంగా రావణ దహనం
యాగం అనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ, హిందూ బంధువులకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగానే కాకుండా, తెలంగాణలోని ప్రతి వీధిలో దేవీ నవరాత్రులను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారని చెప్పారు. చిన్న పిల్లలు సైతం ఎంతో భక్తితో అమ్మవారిని పూజించడం విశేషమన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు.
Also Read: హైదరాబాద్‌లో కొత్త బోర్లకు నో పర్మిషన్! ఎల్‌నినోపై సీఎస్ సంజయ్ జాజు సంచలన ఆదేశాలు