Sanjay Jaju: ఎల్‌నినో ప్రభావంతో రాబోయే వేసవిలో ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సంజయ్ జాజు ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారులతో ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటమే లక్ష్యంగా అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
మండల స్థాయి నుంచే కార్యాచరణ
వేసవిలో ప్రధానంగా వేధించే తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మండల స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రూపొందించాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి, నిరంతరం నీటి సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో అనవసర విద్యుత్ వాడకానికి స్వస్తి చెప్పి, పొదుపు పాటించాలని పిలుపునిచ్చారు.
పరిశ్రమలకు భరోసా.. కొత్త బోర్లపై ఆంక్షలు
పరిశ్రమల నిర్వహణకు విద్యుత్ ఎంతో కీలకమైన నేపథ్యంలో, వాటికి ఎలాంటి పవర్ కట్ ఉండదని సీఎస్ సంజయ్ జాజు స్పష్టమైన భరోసా ఇచ్చారు. పరిశ్రమల యాజమాన్యాలు దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు క్షీణించకుండా చూసేందుకు, భవన నిర్మాణాల కోసం ఇచ్చే కొత్త బోర్‌వెల్ అనుమతులను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు.
నల్లాలకు మోటార్లు పెడితే చర్యలు
మంచినీటి సరఫరాలో అక్రమాలను అరికట్టేందుకు ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ కీలక ప్రకటన చేశారు. మంచి నీటి నల్లాలకు నేరుగా మోటార్లు బిగించి నీటిని లాక్కునే వారిపై ప్రత్యేక డ్రైవ్ చేపడతామని తెలిపారు. అందరికీ సమానంగా తాగునీరు అందాలనే ఉద్దేశంతోనే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Also Read: నగరి మున్సిపల్ పీఠం ఏకగ్రీవం.. హైకోర్టుకు వెళ్తానన్న రోజా!