Bar Council of India: తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ చైర్మన్ ఇటీవల తీసుకున్న కొన్ని ఏకపక్ష నిర్ణయాలకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) బ్రేక్ వేసింది. వివిధ కమిటీల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణకు సంబంధించి జారీ చేసిన ‘ROC No. 510/2026’ ఉత్తర్వులపై మధ్యంతర స్టే విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఏకపక్ష నిర్ణయాలు, సభ్యుల అభ్యంతరాలు
గత అక్టోబర్ 11న జరిగిన జనరల్ బాడీ సమావేశంలో కమిటీల నియామకంపై పలువురు సభ్యులు తీవ్ర అభ్యంతరాలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేశారు. అయితే, వాటిని సమావేశ మినిట్స్‌లో నమోదు చేయకుండా చైర్మన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని బీసీఐకి ఫిర్యాదులు అందాయి. కమిటీల ఏర్పాటులో అడ్వకేట్స్ యాక్ట్–1961 నిబంధనలను పాటించలేదనే విమర్శల నేపథ్యంలో బీసీఐ జోక్యం చేసుకుంది. ఈ వ్యవహారంపై స్పష్టమైన వివరణతో పాటు సంబంధిత రికార్డులను నిర్ణీత గడువులోగా సమర్పించాలని తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్, కార్యదర్శులను ఆదేశించింది.
ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియకు ఆటంకం లేకుండా చర్యలు
మరోవైపు, ఈ వివాదాల వల్ల కొత్త న్యాయవాదుల నమోదు ప్రక్రియ నిలిచిపోకుండా బీసీఐ సమయానుకూల నిర్ణయం తీసుకుంది. ఎన్‌రోల్‌మెంట్ కోసం బార్ కౌన్సిల్ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ మరియు తెలంగాణకు చెందిన బీసీఐ సభ్యుడితో కూడిన ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. కౌన్సిల్ నిర్వహణలో పారదర్శకత, ప్రజాస్వామ్య విధానాలు కచ్చితంగా అమలు కావాలని స్పష్టం చేసిన బీసీఐ, ఈ వివాదాస్పద అంశాలపై తదుపరి విచారణను కొనసాగించనుంది.
Also Read: జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై ఈటల రాజేందర్ సంచలన నిర్ణయం.. ఈ నెల 27 నుంచి పాదయాత్ర!