Etela Rajender: స్వేచ్ఛ బ్యూరో : జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించి, పరిసర ప్రాంతాల ప్రజలకు కాలుష్య విముక్తి కల్పించాలని డిమాండ్ చేస్తూ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈ నెల 25న రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించి, 27 నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. డంపింగ్ యార్డు సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి ప్రజలంతా కలిసిరావాలని పిలుపునిచ్చారు. పాదయాత్ర సన్నాహక సమావేశంలో బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈటల రాజేందర్ మాట్లాడుతూ..
ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు కారణంగా చుట్టుపక్కల సుమారు 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. లీచేట్ నీటితో చెరువులు కలుషితమై చేపలు చనిపోతున్నాయని, ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు నివసించే ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్యంపై సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యను పార్లమెంటులో ప్రస్తావించానని, కేంద్ర మంత్రిని కలిసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక తీసుకురావాలని సూచించారని తెలిపారు.
జవహర్‌నగర్‌పై బిజెపి పాదయాత్ర!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి సమస్య తీవ్రతను వివరించినా ఫలితం లేదని విమర్శించారు. చెత్త నిర్వహణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, దుర్వాసన, లీచేట్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారంతో సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా, పత్రికలు తమకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఉద్యమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అండగా ఉంటామని హామీ ఇచ్చారని తెలిపారు. అవసరమైతే జవహర్‌నగర్‌లో సకల జనుల సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ..
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమస్య పరిష్కారానికి ఈటల రాజేందర్ చేపట్టనున్న పాదయాత్రలో తాము కూడా పాల్గొంటామని ప్రకటించారు. ఈ సమస్యపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు.సమావేశంలో బీజేపీ సీనియర్ రాష్ట్ర నాయకులు మోహన్‌రెడ్డి, ఎస్. మల్లారెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవినాయక్, మేడ్చల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు బుద్ధి శ్రీనివాస్, మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్‌రెడ్డి, రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ గండే తదితరులు పాల్గొన్నారు. పలువురు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Also Read: 2028లో నాయకులను చెప్పులతో కొడతారు..జేసీ ప్రభాకర్ రెడ్డి షాకింగ్ కామెంట్స్!