Big TV Chairman: వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ అనేక ఒత్తిళ్లను ఎదుర్కొనే జర్నలిస్టుల జీవితాలు ఎల్లప్పుడూ కత్తి మీద సాములాంటివే. వార్తల కోసం పరుగులు పెట్టే రిపోర్టర్లు, ఊహించని ఆరోగ్య సమస్యల బారిన పడినప్పుడు ఆ కుటుంబాలు పడే వేదన వర్ణనాతీతం. ఇలాంటి పరిస్థితే బిగ్ టీవీ రిపోర్టర్ కు ఎదురుకాగా.. యాజమాన్యం స్పందించిన తీరుపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. బిగ్ టీవీ ఛైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి.. నిమిషాల వ్యవధిలో చికిత్సకు అవసరమైన రూ.12 లక్షలు అందించి తన ఉద్యోగికి అండగా నిలిచారు.
ఢిల్లీలో బిగ్ టీవీ తరఫున రిపోర్టర్గా విధులు నిర్వర్తిస్తున్న శివను గురువారం ఉదయం ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం చుట్టుముట్టింది. క్షణాల వ్యవధిలో ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో శివ ఎడమ చేయి, ఎడమ కాలు పూర్తిగా చచ్చుబడిపోయాయి. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో భార్య తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకుని పక్కనే ఉన్న తోటి జర్నలిస్ట్ కు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే తోటి రిపోర్టర్ రాజు హుటాహుటీనా శివ ఇంటికి చేరుకున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆయన.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా శివను సమీపంలోని ప్రముఖ మాక్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరగానే వైద్యులు అత్యవసర చికిత్సను ప్రారంభించారు. ఈ సందర్భంగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు శివ ప్రాణాలు నిలవాలంటే తక్షణమే సర్జరీ అవసరమని, దీనికి దాదాపు రూ. 12 లక్షల వరకు ఖర్చవుతుందని తెలియజేశారు. అంత పెద్ద మొత్తాన్ని చూసి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ విషయాన్ని వెంటనే బిగ్ టీవీ యాజమాన్యానికి చేరవేశారు.
విషయం తెలిసిన వెంటనే బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి ఏమాత్రం ఆలోచించకుండా, క్షణాల వ్యవధిలో స్పందించారు. వెంటనే అకౌంట్స్ విభాగాన్ని అప్రమత్తం చేసి ఆసుపత్రికి రూ. 12 లక్షల రూపాయలను తక్షణమే విడుదల చేయించారు. డబ్బు సకాలంలో అందడంతో వైద్యులు వెంటనే తదుపరి వైద్య ప్రక్రియను (Medical Procedure) విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో రిపోర్టర్ శివ ప్రాణాపాయం నుంచి పూర్తిగా బయటపడ్డారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు.
Also Read: తప్పుడు అకౌంట్కు యూపీఐ మనీ ట్రాన్స్ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!
ఒక ఉద్యోగి ప్రాణాలను కాపాడటం కోసం ఏమాత్రం వెనుకాడకుండా లక్షలాది రూపాయలు సమకూర్చిన బిగ్ టీవీ చైర్మన్ విజయ్ కుమార్ రెడ్డి పెద్ద మనసును మీడియా వర్గాలు కొనియాడుతున్నాయి. కష్టకాలంలో సిబ్బందికి అండగా నిలిచే ఇలాంటి యాజమాన్యాలు ఉండటం చాలా అరుదని పలువురు జర్నలిస్టులు పేర్కొంటున్నారు. బిగ్ టీవీ ఛైర్మన్ చూపిన ఔదార్యం జర్నలిస్ట్ లోకానికి పెద్ద భరోసానిస్తుందని మీడియా మిత్రులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also Read: చదువుతూనే సంపాదన.. బ్లింకిట్ డెలివరీ బాయ్గా మారిన లా స్టూడెంట్.. తొలిరోజు సంపాదన ఎంతంటే?