Delhi Blast High Alert:దిల్లీలో బాంబు పేలుడు ఘటనతో దేశ వ్యాప్తంగా భద్రతా బలగాలు, పోలీసులు అలర్ట్ అయ్యారు. దిల్లీ ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి భారీ పేలుడు సంబంధించింది. ఈ ఘటనలో 10 మంది మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. దిల్లీ పేలుడుతో దేశంలో ప్రధాన నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. దిల్లీ సహా ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు తదితర నగరాల్లో కేంద్ర హోంశాఖ హైఅలర్ట్ జారీ చేసింది. దిల్లీ బ్లాస్ పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు, ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో అలర్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. నగరంలోని పలుచోట్ల పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో నాకా బందీ ఏర్పాటు చేసి రద్దీ ప్రదేశాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని హైదరాబాద్ నగర సీపీ సజ్జనార్ ప్రజలను కోరారు.
దిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్రాంతంలో కారులో బాంబు పేలుడు సంభవించింది. హైగ్రేడ్ ఎక్స్‌ప్లోజివ్‌తో పేలుడు సంభవించినట్లు దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. ఎర్రకోట గేట్ నంబర్ 1 దగ్గర జరిగిన పేలుడు ధాటికి ఐదు కార్లు ధ్వంసం అవ్వగా, ఇతర వాహనాలకు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే 10 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు.
పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. భద్రతను కట్టుదిట్టం ఆదేశించారు. ఎన్ఐఏ, ఎన్ఎస్జీ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. బాంబు స్క్వాడ్ బృందాలు కూడా ఘటనాస్థలాన్ని జల్లెడపడుతున్నాయి. పేలుడుదాటికి ఎర్రకోట ప్రాంతం బీతావాహంగా మారింది. మృతదేహాలు ఛిద్రమయ్యాయి. స్థానికంగా ఉన్న ఇళ్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. భారీ పేలుడు దాటికి దిల్లీ నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్ లో భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడిన గంటల వ్యవధిలోనే పేలుడు సంభవించడం అలజడి రేపింది. పేలుడుపై ప్రధాని మోదీ ఆరా తీస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షాతో ప్రధాని మోదీ ఫోన్ లో మాట్లాడారు.
Also Read: Delhi Blast: కదులుతున్న కారులో బ్లాస్ట్.. ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?
దిల్లీ పేలుడు నేపథ్యంలో అనేక రాష్ట్రాలు అప్రమత్తంగా ఉన్నాయి. బీహార్‌లో పోలీసు బృందాలు అప్రమత్తంగా అయ్యాయి. ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే చండీగఢ్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులు హై అలర్ట్ జారీ చేశారు. కేరళ డీజీపీ ఆజాద్ చంద్రశేఖర్ రాష్ట్రవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేయాలని పోలీసులను ఆదేశించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను హై అలర్ట్‌లో ఉండాలని ముమ్మర తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.