Kalvakuntla Kavitha: రోజురోజుకి రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత తన మార్క్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు.. బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసిన తర్వాత ఆమెకు, గులాబీ పార్టీకి మధ్య దూరం పెరుగుతూనే వస్తోంది.. రానున్న రోజుల్లో కారు పార్టీకి కవిత రూపంలో ముప్పు ఏర్పడనుందా? కవిత జనం జాగృతి యాత్ర పేరిట చేస్తున్నదేంటి?
తనను బీఆర్ఎస్ సస్పెండ్ చేసినప్పటి నుంచి ప్రజల సమస్యలకై పోరాటం చేస్తున్నానని.. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆడపిల్లలు దిగితే ఎలా ఉంటుందో చూపిస్తా అంటూ ఛాలెంజ్ విసిరారు కవిత.. ఎలక్షన్స్ కి ఇంకా మూడేళ్లు ఉండగా తాను ఇప్పటి నుంచే రాజకీయాలు చేయాలని అనుకోవడం లేదని కవిత స్పష్టం చేశారు.. ఎన్నికలకు సంవత్సరం ముందు నుంచి తాను రాజకీయం చేస్తానంటూ చెప్పుకొచ్చారు.. తాను రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటారని కవిత సవాల్ చేశారు..
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కవిత.. హరీష్ రావు, సంతోష్ రావులపైన బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.. అయితే వరంగల్ వేదికగా మరోసారి హరీష్‌రావుపై సంచలన ఆరోపణలు చేశారు కవిత.. ఇక ఎంజీఎం హాస్పిటల్ కొత్త భవనం ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు.. ముందు 1100ల కోట్లతో ఒక కంపెనీకి వచ్చిన టెండర్ ను మరో బినామీ కంపెనీకి ఎందుకు మార్చారని.. ఆ బినామీ కంపెనీ భవనం ఖర్చును 17 వందల కోట్లకు చేర్చిందని.. అసలు ఆ కంపెనీ హరీష్‌రావుదేనని కవిత బాంబ్ పేల్చారు.
బీఆర్ఎస్ హయాంలో తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని కవిత అన్నారు .. తనకసలు డబ్బు మీద ఆశే లేదని, తనకు బీఆర్ఎస్ లో ఎవరితోనూ పంచాయితీలు లేవని, కావాలనే తనను కుటుంబం నుంచి బయట పడేశారని పదే పదే తన యాత్రలో కవిత చెప్తున్నారు.. కవిత చేస్తున్న ఈ ఆరోపణలు బీఆర్ఎస్ కు పరోక్షంగా డ్యామేజ్ చేస్తాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.. కవిత వల్ల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని గులాబీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి..
జాగృతి జనం బాట పేరుతో జిల్లాల్లో పర్యటిస్తున్న కల్వకుంట్ల కవిత..బీఆర్ఎస్ పార్టీలో జరిగిన పరిణామాలు, తనపై బీఆర్ఎస్‌లో జరిగిన కుట్రలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ విధానాలను, ఆ పార్టీ నేతల తీరును ఎండగడుతున్నారు కవిత. జిల్లాలో పర్యటనల్లో మాట్లాడుతున్న కవిత…బీఆర్ఎస్ విషయంలో తన స్టాండ్ ఏంటో స్పష్టంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తానన్న కవిత వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్నికలకు ఏడాది ముందు తన రాజకీయం మొదలవుతుందనే కామెంట్స్ ద్వారా కవిత రాజకీయంగా ముందుకు వెళ్లబోతున్నారనే సంకేతాలు పంపించడం చర్చనీయాశంగా మారింది.
Story by Apparao, Big Tv