Paddy Procurement Record: తెలంగాణ రాష్ట్రం వరి ధాన్యం సేకరణలో ఈ ఖరీఫ్ సీజన్‌లో కొత్త రికార్డు సృష్టించింది. గతేడాది ఇదే సమయానికి 3.94 లక్షల మెట్రిక్ టన్నులు (LMT) మాత్రమే సేకరించగా, ఈసారి ఇప్పటివరకు ఏకంగా 8.54 LMT ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇది రెట్టింపు కంటే ఎక్కువ కావడం గమనార్హం. రాష్ట్రంలో వరి, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్ల పురోగతిపై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సమీక్ష నిర్వహించారు. చీఫ్ సెక్రటరీ ఎస్. రామకృష్ణారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో, ప్రతికూల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని, సేకరణపై జరిగే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మంత్రులు కలెక్టర్లను ఆదేశించారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకే ఖరీఫ్ సీజన్‌లో 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం దేశంలోనే ఇది తొలిసారని అన్నారు. ఇప్పటివరకు సేకరించిన ధాన్యంలో 3.95 LMT సన్న రకం, 4.59 LMT దొడ్డు రకం ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం విక్రయించిన రైతుల సంఖ్య కూడా గతేడాది (55,493) పోలిస్తే ఈసారి 1,21,960కి పెరిగిందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మొత్తం మద్దతు ధర విలువ రూ. 2,041.44 కోట్లు కాగా, ఇందులో ఇప్పటికే రూ. 832.90 కోట్లు రైతులకు చెల్లించారని మంత్రి తెలిపారు. మిగిలిన రూ. 1,208.54 కోట్లను 48 గంటల్లోగా ఓపీఎంఎస్ (OPMS) ద్వారా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సన్న రకాలకు చెల్లించే బోనస్ విలువ కూడా రూ. 197.73 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
రైతులు ఇటీవలే ‘మొంథా’ తుఫాను నష్టం నుండి కోలుకుంటున్నారని, వాతావరణ మార్పుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పాలిన్లను సిద్ధంగా ఉంచాలని, తడిసిన ధాన్యాన్ని వెంటనే బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని ఆదేశించారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. మొక్కజొన్న కొనుగోలు పరిమితిని ఎకరానికి 18.5 నుండి 25 క్వింటాళ్లకు పెంచడం పట్ల రైతులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. అయితే, పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి విధించడం ఇబ్బందిగా మారిందని, దీనిని 12 క్వింటాళ్లకు పెంచాలని కేంద్రాన్ని కోరతామని ఆయన స్పష్టం చేశారు. తుఫాను వల్ల రంగు మారిన సోయాబీన్‌ను కూడా కొనుగోలు చేయాలని, తేమ నిబంధనలు సడలించాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. నవంబర్ నెల మొత్తం సేకరణకు అత్యంత కీలకమని, 55% కొనుగోళ్లు రానున్న నాలుగు వారాల్లోనే జరుగుతాయని మంత్రులు పేర్కొన్నారు.