Delhi Bomb Blast: దిల్లీ ఎర్రకోట బాంబు పేలుడుతో దేశం ఉలిక్కిపడింది. బాంబు పేలుడుతో ఎర్రకోట ప్రాంతం భయానకంగా మారింది. పేలుడు దాటికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతి చెందిన వారి మృతదేహాలు ముక్కలుగా సమీప ప్రాంతాలకు ఎగిరి పడ్డాయి. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ప్రకారం ఒకరి చేయి భాగం రోడ్డుపై కనిపించింది.
ఘటనా స్థలంలో ఉన్న ఒక మైనర్ బాలుడు (ప్రత్యక్ష సాక్షి) చెప్పిన వివరాలు పేలుడు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. “నేను మూడు కార్లు పేలడం చూశాను, 15 నుండి 20 మంది తీవ్రంగా గాయపడ్డారు” అని బాలుడు తెలిపాడు. అత్యంత దారుణంగా, కొన్ని మృతదేహాలు నడుము భాగం నుంచి రెండుగా ఛిద్రమై పడి ఉన్నాయని ఆ బాలుడు చెప్పడం అక్కడి దయనీయ పరిస్థితిని తెలియజేస్తోంది. గాయపడిన మరో వ్యక్తి, తాను ఒక కారులో పేలుడు చూశానని చెప్పాడు. సోమవారం సాయంత్రం 6.52 గంటల ప్రాంతంలో, నెమ్మదిగా కదులుతున్న కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగినప్పుడు బాంబు పేలుడు జరిగిందని పోలీసులు తెలిపారు.
దేశ రాజధాని జిల్లీ రెడ్ ఫోర్ట్ గేట్ నెంబర్ 4 దగ్గర భారీ పేలుడు సంభవించింది. సిగ్నల్ వైపు నెమ్మదిగా కదులుతున్న ఒక కారులో పేలుడు జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆత్మాహుతి దాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 100 నుంచి 150 మీటర్ల వరకు పేలుడు పరిధి ఉందని పోలీసుల అంచనా వేస్తున్నారు. విధులు ముగించుకొని జనాలు ఇళ్లకు చేరే క్రమంలో ఈ పేలుడు సంభవించింది. 2011 దిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్లు తర్వాత అంటే దాదాపు 14 సంవత్సరాల తర్వాత దిల్లీలో మరోసారి పేలుళ్లు జరగడం కలవరం రేపుతోంది.
ఈ పేలుడు టెర్రరిస్టుల పనే అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పేలుడు దాటికి సంఘటనా స్థలం భయానకంగా మారింది. దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు.
పేలుళ్ల దెబ్బకు 6 కార్లకు మంటలు వ్యాపించాయి. నాలుగు ఆటో రిక్షాలు, 4 బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో 10 మంది మరణించినట్లు సమాచారం. 30 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. మరో 10 మంది పరిస్థితి విషమం ఉందని వైద్యులు తెలిపారు. పేలుడు జరిగిన పరిసరాల్లో 15 చోట్ల బారికేడ్లు ఏర్పాటు చేశారు. సంఘటనా స్థలంలో సీఆర్పీఎఫ్ బలగాలు, ఇతర భద్రతా సిబ్బందిని మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, దిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు వివరాలు సేకరిస్తున్నారు. చాందినీ చౌక్ ను మూసివేశారు. వ్యాపారులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
Also Read: Delhi Blast: కదులుతున్న కారులో బ్లాస్ట్.. ఉగ్రవాదులు ఎలా ప్లాన్ చేశారంటే?
గత కొంతకాలంగా దేశంలోని జమ్ము కాశ్మీర్, హర్యానా, గుజరాత్ లతో పాటు దిల్లీలో ఉగ్రవాద మూకలు కదలికను భద్రతా బలగాలు పసిగట్టాయి. స్లీపర్ సెల్స్ కదలికలు, నాలుగు వేల మంది పాకిస్తానీలతో కూడిన ఒక టెలిగ్రామ్ గ్రూప్ ను పోలీసులు గుర్తించారు. దిల్లీ శివారులోని ఫరీదాబాదులో దాదాపు 2560 కిలో గ్రాముల అమ్మోనియం నైట్రేట్, 350 కేజీల ఆర్డీఎక్స్ లాంటి పేలుడు పదార్థాలను సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో భారీ పేలుడు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.