BigTV English
Advertisement

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Thati Venkateswarlu: బీఆర్ఎస్ లో అగ్గి రాజుకుందా ?

Thati Venkateswarlu:  ఆయన ఏం మాట్లాడినా సంచలనమే, ఏం చేసిన అది హాట్ టాపిక్ గా మారిపోవటం ఖాయం అలాంటి నేత మరోసారి వార్తలో నిలిచారు ఈసారి సొంతపార్టీ జిల్లా అధ్యక్షుడి పై విరుచుకుపడ్డారు ఆయన ఎవరో కాదు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు . జిల్లా అధ్యక్షుడిని తాటి వెంకటేశ్వర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు తాటి వెంకటేశ్వర్లు పార్టీలో కొనసాగాలనే భావిస్తున్నారా! లేక పార్టీ మారే ఉద్దేశ్యంతో ఉన్నారా? ఎందుకు తాటి వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షుడిపై ఇంత కోపంగా ఉన్నారు? జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు ఎందుకు పార్టీలో తాటి వెంకటేశ్వర్లు ఎదుగుదలను అడ్డుకుంటున్నారు?


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్యపోరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కు మరో నేత మెచ్చా నాగేశ్వరరావు , జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుతో అస్సలు పొగడటం లేదు. ఆ క్రమంలో ఇక తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధం అవుతున్నారు తాటి వెంకటేశ్వర్లు. ఇందుకు స్థానిక ఎన్నికలే సరైన సమయంగా భావిస్తూ, తన అనుచరులతో కలిసి త్వరలో ఓ సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. దీనితో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ఏంటీ రచ్చ అని తలలు పట్టుకుంటున్నారు.

అశ్వారావుపేటలో ఒక్కసారి కూడా గెలవని గులాబీ పార్టీ:

ఇక పార్టీ విషయానికొస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఇప్పటివరకు 3 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారి కూడా అశ్వారావుపేట నియోజకవర్గంలో గులాబీ పార్టీ గెలిచింది లేదు. పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇతర పార్టీల వారు బీఆర్ఎస్‌లో చేరటమే తప్ప ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పెద్దగా ప్రభావం చూపింది లేదు. అధికారం పోవడంతో ఆ పార్టీలో చేరేవారు కరువయ్యారు. ప్రస్తుతం మిగిలిన ఒకరిద్దరు నాయకులను కూడా కాపాడుకోవటంలో కూడా రాష్ట్ర నాయకత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నేరుగా విమర్శిస్తున్నారు.


బీఆర్ఎస్‌కు కొరకరాని కొయ్యగా మారిన తాటి వెంకటేశ్వర్లు:

అశ్వారావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బిఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు అనే చెప్పుకోవాలి. అటు బిఆర్ఎస్ పార్టీకి నిర్మాణాత్మక సూచనలు చేస్తూనే జిల్లా అధ్యక్షుడు ,రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పిస్తు అటు పార్టీని ఇటు కేడర్ ను ఇరకాటంలో పెడుతున్నారు. అటు మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మాత్రం తాను కేసీఆర్ కు వీరవిధేయుడినని, అశ్వారావుపేట నియోజకవర్గ ఇంచార్జి పదవి తనదేనంటూ , వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ అసెంబ్లీ టిక్కెట్ కూడా తనదే అన్నట్టు తనపని తాను చేసుకుపోతున్నరు. ఇప్పుడు అదే ఇద్దరి మధ్య వివాదానికి దారి తీసింది.

జిల్లా అధ్యక్షుడు , రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు:

మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పార్టీ ముఖ్యనాయకులను కలుపుకుపోకుండా తన ఒకరిద్దరు అనుచరులు , జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి ఓ ఫాం హౌస్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. దీనితో మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లకు బాగా మండిందంట. తాటి వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఫైర్ అయ్యారు. మెచ్చా నాగేశ్వరావు తోటలో జిల్లా అధ్యక్షుడు మీటింగ్ పెట్టటం ఇదేమీ మొదటిసారి కాదు గతంలో కూడా పెట్టారు అప్పుడు కూడా మాజీ ఎమ్మెల్యే ఇదేవిధంగా రియాక్ట్ అయ్యారు. తోట రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా , ట్రైకార్ చైర్మన్, 30 ఏళ్ల సుదీర్ఘమైన తన అనుభవాన్ని ఉపయోగించుకోవడంలో కానీ, ప్రజా సమస్యలపై పోరాటం , పార్టీని బలపరచడంలో కానీ బీఆర్ఎస్ జిల్లా నాయకత్వం పూర్తిగా విఫలం అయిందని తాటి వెంకటేశ్వర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

తిరుగుబాటుకు సిద్దమైన తాటి వెంకటేశ్వర్లు:

గత ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కలిసి పనిచేసిన దాఖలాలు ఎక్కడా లేవు. అటు పార్టీ కార్యక్రమాలలో తాటి వెంకటేశ్వర్లకు పెద్దగా ప్రాధాన్యత దక్కకపోవడంతో తాటి వెంకటేశ్వర్లకు ఒంటరిగానే నియోజకవర్గంలో అడపదడప పర్యటిస్తూ తన ఉనికిని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ పార్టీ ఉనికి చాటుకునే కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలు సమయం ఆసన్న మవటంతో తాటి వెంకటేశ్వర్లకు తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం తాటి వెంకటేశ్వర్లు స్వయంగా బిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థులుగా తన అనుచరులను నియోజకవర్గం అంతటా అన్ని స్థానాలలో బరిలో నిలుపుతానని హెచ్చరిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు ఇద్దరి ఒంటెద్దు పోకడల కారణంగా పార్టీ గ్రామీణస్థాయిలో ఎదగటం లేదని, మెచ్చా నాగేశ్వరరావును అశ్వారావుపేట అసెంబ్లీ స్థానానికి ఇంచార్జి గా ఎవరు నియమించారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సైతం పట్టించుకునే పరిస్థితి కనిపించటం లేదన్నారు.

రేగా కాంతారావు, మెచ్చా నాగేశ్వరరావు పై విమర్శలు:

గత ఎన్నికల సమయంలో కేసీఆర్, హరీష్ రావు పిలిచి పార్టీలో సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని చెప్పి, స్వయంగా కేసీఆర్ పార్టీలోకి ఆహ్వానిస్తే పార్టీలో చేరటం జరిగిందని తాటి వెంకటేశ్వర్లు అంటున్నారు. అదే సమయంలో కేసీఆర్ తనకు సూచించిన విధంగా మెచ్చా నాగేశ్వరావు గెలుపుకోసం చిత్తశుద్ధితో పనిచేశానని గుర్తుచేస్తున్నారు. పార్టీ ఓటమి చెంది రెండేళ్లు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఓటమికి గల కారణాలు విశ్లేషించుకోక పోవటం సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోకపోవటం దురదృష్టకరం అన్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్ , హరీష్ రావు , ఉమ్మడి ఖమ్మం ముఖ్య నేతల దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోకపోవటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుడుగా తన దగ్గరకు అనేక ఇబ్బందులతో వచ్చే కార్యకర్తలకు అండగా ఉంటూ మండల , జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడుతూ కార్యకర్తలను అనుచరులను కాపాడుకుంటున్నానని తాటి వెంకటేశ్వర్లు అంటున్నారు.. జిల్లా అంతటా పార్టీ కార్యకర్తల పరిస్థితి ఇలానే ఉందన్నారు దీనికి ముఖ్య కారణం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు , మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అని విమర్శలు గుప్పిస్తున్నారు.

తననుండి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదంటున్న తాటి:

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే ధోరణి కొనసాగితే తననుండి ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని అన్ని మండలాలో తన అనుచరులు పోటీలోకి రంగంలోకి దిగుతారని హెచ్చరికలు జారీచేస్తున్నారు.. మెచ్చా నాగేశ్వరరావు కు తనకంటే ఏం గొప్ప అని తానైన జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు అయిన మరోపార్టీ నుండి గెలిచి వచ్చిన వాళ్ళమే అన్నారు. ఇటీవల పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగ కాంతారావు కొంత అభద్రతాభావంలో ఉన్నట్లు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. తాటి వెంకటేశ్వర్లు లాంటి వ్యక్తికి అవకాశాలు దక్కితే తన జిల్లా అధ్యక్ష పదవికి చెక్ పడుతుందనే భ్రమలో జిల్లా అధ్యక్షుడు ఉండి ఉండొచ్చు అంటున్నారు.

కానీ తన మనస్సులో అలాంటి ఆలోచన లేదన్నట్లుగా తాటి మాట్లాడారు. పార్టీలో నాయకుల మధ్య ఆధిపత్య పోరు ఉండటం సాధారణమే కానీ ఎన్నికల సమయంలో సమష్టిగా కలిసి పనిచేస్తూ పార్టీని బలపరచాల్సినప్పుడు ఇలా తోటల్లో , గుట్టు చప్పుడు కాకుండా సమావేశాలు ఏర్పాటుచేయటం సమావేశాలకు జిల్లా అధ్యక్షుడు వచ్చి అటునుండి అటే పోవటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని కార్యకర్తలు సైతం కూడా వ్యక్తం చేయటం విశేషం. నియోజకవర్గ సమస్యలపై అవగాహన లేని వ్యక్తి కార్యకర్తలకు భరోసా కల్పించలేని వ్యక్తి మెచ్చా నాగేశ్వరావు లాంటి వ్యక్తి చేతిలో బాధ్యతలు పెడితే, పార్టీని బలపరచటం పార్టీ కార్యకర్తలను కాపాడుకోవటం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

బీఆర్ఎస్ నాయకత్వం పై విమర్శలు:

గతంలో కూడా తాటి వెంకటేశ్వర్లు ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో తనకు రాజకీయ జన్మని ఇచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరతారని, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిసినట్టు, ఇక ఆ పార్టీలో చేరి పార్టీని ముందుండి నడిపిస్తారనే చర్చా నియోజకవర్గంలో జోరుగా జరిగింది. కాని తాటి వెంకటేశ్వర్లు అనంతరం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనటం కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం చేయటంతో ఆ టాపిక్ కి చెక్ పడింది. ఇప్పుడు మరోసారి బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శలు చేయడమే కాకుండా తాడోపేడో తేల్చుకుంటా అనే విధంగా వ్యాఖ్యలు చేయడంతో ఈసారి ఏం జరగబోతుందో అనే చర్చ జోరందుకుంది అయితే ఇప్పటికే పలుమార్లు పార్టీ మారడంతో తాటిపై నిలకడలేని నేత అనే ప్రచారం కూడా ఉంది..

జిల్లా అధ్యక్షుడు నియోజకవర్గానికి వస్తున్నప్పుడు ముఖ్య నాయకులకు సమాచారం అందించాలి. పార్టీ ముఖ్య నాయకులను కలుపుకోవాలి అందరికి ఆమోదయోగ్యమైన ప్రదేశం ఎంచుకుని సమావేశాలు ఏర్పాటుచేయాలి అలా కాకుండా ఫాంహౌస్ రాజకీయాలు రాజకీయాలు చేయాలి అనుకుంటే మరోసారి జిల్లాలో పార్టీకి తీవ్ర నష్టం కలగక తప్పదని తాటి వెంకటేశ్వర్లు హెచ్చరిస్తున్నారు. మరి చూడాలి ఈ వివాదం ఏ మలుపులు తిరుగుతుందో?

Story by Apparao, Big Tv

Related News

CM Chandra Babu: ఇదే లాస్ట్ వార్నింగ్.. ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్

Poll Management: పోల్ మేనేజ్‌మెంట్‌పై పార్టీల ఫోకస్

Vidadala Rajini: రజిని కొత్త రచ్చ.. పోలీసులపై ఫైర్

Nalgonda leaders: జూబ్లీహిల్స్‌లో నల్గొండ నేతల జోరు

Proddatur: ప్రొద్దుటూరు క్యాసినో వార్

Jubilee Hills: జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ గ్రాఫ్ ఎలా ఉంది? ఏం తేలిందంటే!

Jubilee Hills Bypoll: బాబు, పవన్‌లపైనే బీజేపీ ఆశలు!

Big Stories

×