Delhi Blasts: దేశ రాజధాని ఢిల్లీ సోమవారం సాయంత్రం భారీ పేలుళ్లతో దద్దరిల్లింది. రద్దీగా ఉండే సాయంత్రం 6:55 గంటల ప్రాంతంలో, ఎర్రకోట (రెడ్ ఫోర్ట్) గేట్ నంబర్ 4 సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ పేలుళ్లలో 13 మంది మరణించారు. మరో 30 మంది గాయపడగా, వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన అనంతరం క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర హోం మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇది ఉగ్రవాద దాడియేనా అని ప్రశ్నించగా, ‘‘మేము అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాము’’ అని అమిత్ షా అన్నారు.“ఈ ఘటనకు కారణం ఏమిటో ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ఘటనా స్థలం నుంచి సేకరించిన నమూనాలను ఎఫ్‌ఎస్‌ఎల్ (FSL), ఎన్‌ఎస్‌జీ (NSG) విశ్లేషించే వరకు, దీని గురించి ఖచ్చితంగా ఏమీ చెప్పలేము. అయినప్పటికీ, మేమే ఏ కోణాన్నీ కొట్టిపారేయడం లేదు. అన్ని కోణాల్లోనూ నిశ్చయంగా దర్యాప్తు చేస్తాం.” అని అమిత్ షా స్పష్టం చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల నుంచి ప్రజలు ఇళ్లకు తిరిగి వెళ్లే సమయంలో ఈ దాడి జరగడంతో ప్రాణనష్టం ఎక్కువగా ఉంది. ఆత్మాహుతి దళాల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ కారు నదీమ్ అనే వ్యక్తి పేరు మీద నమోదైనట్లు సమాచారం. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, మెట్రో స్టేషన్ సమీపంలోని సిగ్నల్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక HR26 7674 నెంబర్ ప్లేట్ గల హ్యూందాయ్ కారులో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆరు కార్లు, నాలుగు ఆటో రిక్షాలు, నాలుగు బైక్‌లు పూర్తిగా దగ్ధమయ్యాయి. పేలుడు తీవ్రత 100 నుంచి 150 మీటర్ల పరిధి వరకు ఉందని, శబ్దం కిలోమీటర్ దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. ఈరోజు సోమవారం కావడంతో, ఘటన జరిగిన ప్రదేశానికి కేవలం 70 మీటర్ల దూరంలో ఉన్న గౌరీ శంకర్ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో ఆ ప్రాంతం జనంతో కిక్కిరిసి ఉంది. చాందినీ చౌక్, ఎర్రకోట పరిసర ప్రాంతాలు విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: Delhi Blast High Alert: దిల్లీ బ్లాస్ట్ ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హైఅలర్ట్.. పలుచోట్ల ముమ్మర తనిఖీలు
ఇది కేవలం సీఎన్‌జీ పేలుడు కాదని, ఉగ్రవాదుల పనే అయి ఉంటుందని అధికారులు బలంగా అనుమానిస్తున్నారు. 2011 ఢిల్లీ హైకోర్టు పేలుళ్ల తర్వాత (దాదాపు 14 ఏళ్ల తర్వాత) రాజధానిలో ఇంత పెద్ద దాడి జరగడం ఇదే కావడం గమనార్హం. జాతీయ భద్రతా సంస్థ (NIA), నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (NSG) బృందాలతో పాటు ఢిల్లీ స్పెషల్ సెల్, క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరిస్తున్నారు. పోలీసులు దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చాందినీ చౌక్ మార్కెట్‌ను మూసివేసి, వ్యాపారుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.