Iconic Bridge: హైదరాబాద్‌లోని మిర్ ఆలం ట్యాంక్ మీదుగా ఐకానిక్ వంతెన (Iconic Bridge) నిర్మాణానికి సంబంధించి టెండర్ పనులకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వంతెన బెంగళూరు జాతీయ రహదారిని శాస్త్రీపురం నుంచి చింతల్ మెట్ వరకు కలుపుతూ.. ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, నిర్మాణం (EPC) విధానంలో చేపట్టనున్నారు. వంతెన నిర్మాణ బాధ్యతలను కెఎన్‌ఆర్ కన్‌స్ట్రక్షన్స్ లిమిటెడ్ సంస్థకు అప్పగించారు.
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం దాదాపు రూ.319.24 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఎల్‌ఓఏ జారీ చేసి, నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాలని మేనేజింగ్ డైరెక్టర్, ఎంఆర్‌డీసీఎల్ ను ఆదేశించింది. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తగ్గించి.. కనెక్టివిటీని పెంచడంలో కీలక పాత్ర పోషించనుంది. తాజాగా.. ఈ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం లభించడంతో టెండర్ ప్రక్రియకు మార్గం సుగమమైంది. త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
⦿ అత్యద్భుతంగా ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి..
ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో నగరంలోని ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు, హైదరాబాద్‌కు ఒక విశిష్ట గుర్తింపును తీసుకొస్తుందని భాగ్యనగర వాసులు భావిస్తున్నారు. ఈ వంతెన ఆధునిక డిజైన్‌తో, అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇది నగర భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పకడ్బందీతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఇప్పటికే ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వంటి ఇతర ఐకానిక్ నిర్మాణాలకు పోటీగా నిలుస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
⦿ అక్రమ నిర్మాణాల తొలగింపులో హైడ్రా కీలక పాత్ర..
మీరాలం చెరువు, హైదరాబాద్‌లోని ముఖ్యమైన నీటి వనరులలో ఒకటి. దీని చుట్టూ అనేక అక్రమ నిర్మాణాలు గతంలో సమస్యగా మారాయి. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRA) ఈ అక్రమ నిర్మాణాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ కేబుల్ బ్రిడ్జి నిర్మాణం చెరువు పరిరక్షణకు భంగం కలిగించకుండా.. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ నిర్మించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ వంతెన నిర్మాణం పూర్తి అయితే.. శాస్త్రిపురం, చింతల్‌మెట్ ప్రాంతాల మధ్య సమయం ఆదా అవుతుంది.
⦿ హైదరాబాద్‌కు మరింత విశిష్టత..
ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్డి నిర్మాణం పూర్తి అయిన తర్వాత త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. అదనంగా, ఈ ప్రాజెక్టు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తూ.. ఉపాధి అవకాశాలను కూడా కల్పించే అవకాశం ఉంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరంగా మార్చే దిశగా ఈ నిర్మాణం మరో అడుగు వేస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
⦿ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం గురించి…
ఈ బ్రిడ్జి లెంగ్త్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. వెడెల్పు 16.5 మీటర్లతో నాలుగు రోడ్లు, చివరలకు కాలి బాట ఉంటుంది. మీరాలం చెరువుకు వెస్ట్ లో ఉన్న చింతల్ మెట్, ఈస్ట్ లో శాస్త్రిపురం నుంచి సాగిపోయే బెంగళూరు నేషనల్ హైవేని కలుపుతూ నిర్మిస్తున్నారు. దీని వల్ల బహదూర్ పుర్, శాస్త్రిపురం, అత్తాపూర్, కిషన్ బాగ్, చింతల్ మెట్ ప్రాంతాల్లో వాహనదారులకు ప్రయోజనం కలుగుతుంది. అలాగే చింతల్ మెట్ నుంచి బెంగళూరు నేషనల్ హైవే ద్వారా ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికి ప్రయోజనం చేకూరనుంది.
⦿ మీరాలం చెరువు చారిత్రక నేపథ్యం ఏంటి..?
మీరాలం చెరువు, హైదరాబాద్‌లోని ఒక చారిత్రక జలాశయం, మూడో నిజాం కాలంలో నిర్మించారు. ఈ చెరువు 1806లో మీర్ ఆలం బహదూర్ పేరుగా జలాశయాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన దివాన్ గా పనిచేశారు. ఈ చెరువును నీటిపారుదల, తాగునీటి సరఫరా కోసం ఉపయోగపడింది. నిజాం వంశస్థులు నిర్మించిన అనేక జలాశయాలలో ఇది ఒకటి. ఈ చెరువు మధ్యలో మూడు దీవులు ఉంటాయి. ఈ చెరువు చుట్టూ ఉన్న సుందరమైన ప్రకృతి దృశ్యాలు, చారిత్రక నిర్మాణాలు దీనిని ఒక ప్రముఖ ఆకర్షణగా మార్చాయి. నేడు, ఇది స్థానికులకు విశ్రాంతి ప్రదేశంగా, పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది.
ALSO READ: Dates Benefits: ఖర్జూరాన్ని ఇలా తీసుకున్నారంటే.. వందల రోగాలు మటుమాయం!