కూటమి ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. దేవుడిని అడ్డుపెట్టుకుని సీఎం చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అంబటి ఆరోపించారు. నిన్న కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని ప్రసాదం బాగుందన్నారు. దీంతో నేను కూటమి ప్రభుత్వాన్ని పొగిడానంటూ ప్రచారం చేసుకోవడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు.
విశాఖలో CCI పార్టనర్‌షిప్ సమ్మిట్‌కు వచ్చే అతిధులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా.. విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. రోడ్ల బ్యూటిఫికేషన్ చేయడమే కాకుండా.. బీచ్ లో విదేశీ అతిధుల కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. మరో 50 రోజుల్లో జరగబోయే నావీ ఫ్లీట్ కోసం కూడా విశాఖ నగరాన్ని సిద్ధం చేసినట్లు గార్గ్ చెప్పారు.
మాజీ మంత్రి కేటీఆర్ ధోరణిని విమర్శిస్తూ మాగంటి గోపినాథ్ అభిమానులు జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. గోపినాథ్ మరణం తర్వాత జరుగుతున్న పరిణామాలతో తమకు గోపినాథ్ మరణంపై అనుమానాలు వస్తున్నాయంటూ పోస్టర్లలో తెలిపారు. గోపినాథ్ మృతి చెందాక తల్లిని కూడా చూడనివ్వకపోవడంపై సందేహాలు ఉన్నాయన్నారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో కేంద్ర బృందం పర్యటిస్తోంది. మొంథా తుఫాన్ ప్రభావంతో జరిగిన పంటనష్టం, ఆస్తినష్టానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను అధికారులు పరిశీలించారు. అనంతరం రైతులతో పంట నష్టంపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో ఈ బృందం పరిశీలించి.. కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విశాఖ ఎకనామిక్ రీజియన్.. రాష్ట్రానికి గ్రోత్ హబ్‌గా తీర్చిదిద్దే అంశంపై చర్చించారు. శ్రీకాకుళం నుంచి కోనసీమ వరకు వివిధ జిల్లాలను విశాఖ ఎకనామిక్ రీజియన్‌గా అభివృద్ధి చేసే అంశంపై సమీక్షించారు.
రేపటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేశామని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ సుదర్శన్ రెడ్డి అన్నారు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 68 క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల వద్ద CRPFతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. ఫిర్యాదులను 1950 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పొచ్చని అన్నారు.
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లిలో టీడీపీ బహిష్కృత నేత జయచంద్రా రెడ్డి భార్య కల్పనా రెడ్డి స్థానిక నేతలతో సమావేశం నిర్వహించారు. తన భర్త తప్పు చేయలేదంటూ ప్రజల ముందు చెప్పడానికి ఆమె సిద్దమయ్యారు. ఈ సమావేశానికి జయచంద్రా రెడ్డికి చెందిన టీడీపీ, వైసీపీ క్యాడర్ సభ్యులు భారీగా హాజరయ్యారు.
కడప జిల్లా కలశపాడు మండలంలోని కరణంవారిపల్లి పాఠశాలను అందంగా తీర్చిదిద్దడంపై మంత్రి లోకేష్ ప్రశంసలు కురిపించారు. గ్రామస్తుల సహకారంతో స్కూల్‌ను అందంగా తీర్చిదిద్దిన సెకండరీ గ్రేడ్ టీచర్ని కొనియాడారు. సింగిల్ టీచర్‌గా అడుగుపెట్టే నాటికి నలుగురు విద్యార్థులున్న పాఠశాల ఇవాళ 26 మందికి చేరడం అభినందనీయమన్నారు.
వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ డిపోలో ఘోరం జరిగింది. బ్రేకులు ఫెయిల్ అయిన బస్సు ఔటింగ్‌కు వెళ్తున్న సమయంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెకానికల్ కుద్దూస్ ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలై ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. రిటైర్‌మెంట్‌కు సిద్ధమవుతున్న కుద్దూస్ మరణంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో ఐసీడీఎస్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులు బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. పెళ్లికూతురు మైనర్ అని ఫిర్యాదు అందడంతో, వివాహం జరుగుతున్న ఫంక్షన్ హాల్‌కు తాళం వేయించారు. అనంతరం అధికారులు ఇరు కుటుంబాలకు బాల్య వివాహాల అనర్థాలపై అవగాహన కల్పించారు.
కృష్ణా జిల్లా, మచిలీపట్నం నిర్మల పాఠశాల యాజమాన్యం 8వ తరగతి విద్యార్థిపై వివక్ష చూపింది. అయ్యప్ప స్వామి మాల ధరించి రావద్దని, తరగతి గది నుంచి విద్యార్థిని బయటకు పంపించారు. మతపరమైన తాడులు కూడా ధరించరాదని ఆంక్షలు విధించారు. దీనిపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాజరయ్యారు. గృహప్రవేశం ఏర్పాటు చేసుకున్న దంపతులకు ఆయన చేతుల మీదుగా పట్టుబట్టలను సమర్పించారు. గూడులేని నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడులో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి పంట పొలాలను ఇంటర్ మినిస్ట్రియల్ కేంద్ర బృందం పరిశీలించింది. మాజీ మంత్రి వడ్డే శోభనాదీశ్వరరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనలు సడలించి కౌలు రైతులను ఆదుకోవాలని, నష్టపోయిన ప్రతి ఎకరాకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ములుగు జిల్లా పాత్రాపురం గ్రామానికి చెందిన 20 మంది రైతులపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ దాడిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా, మరో 8 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై హిందూపురం ఎంపీ పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కురుబ కులస్తుల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహావిష్కరణకు మంత్రి నారా లోకేష్ రావడం జీర్ణించుకోలేక కూటమి ప్రభుత్వంపై బురదజల్లుతున్నారంటూ విమర్శించారు. తమ ప్రభుత్వం కులాలకు గుర్తింపునిస్తుంటే వైసీపీ విషం కక్కుతోందని అన్నారు.
మేడ్చల్ జిల్లా కీసర RDO కార్యాలయం వద్ద బీసీ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో సుమారు 500 మంది ర్యాలీ నిర్వహించి, ధర్నా చేశారు. గతంలో పట్టాలు ఇచ్చినా వంద గజాల స్థలం కేటాయించకుండా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్థలాలను వేలం వేయకుండా పేదలకు కేటాయించాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.
ఏపీలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియా ప్రచారం కోసం పిటిషన్లు వేస్తున్నారని జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు సూచించింది.
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబోలోని భారీ చిత్రం SSMB29 కోసం నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక చారిత్రక ఈవెంట్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 50 వేల మందికి పైగా అభిమానులు హాజరుకానున్న ఈ ఈవెంట్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద స్టేజ్, 100 అడుగుల భారీ స్క్రీన్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌లో సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన వెల్లడించే అవకాశం ఉంది.
డీప్‌ఫేక్, ఏఐ దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. జడ్జీలు, లాయర్ల మార్ఫింగ్ చిత్రాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపారు. జనరేటివ్ ఏఐ వినియోగాన్ని నియంత్రించాలని లాయర్ కార్తికేయ రావల్ పిటిషన్‌ను విచారిస్తూ.. ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చైనా ఈస్ట్రన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఐదేళ్ల తర్వాత షాంఘై-ఢిల్లీ విమాన సర్వీసును ఆదివారం ప్రారంభించింది. 248 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఈ విమానం, రెండు దేశాల మధ్య వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.