Ghatkesar Death: స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఏదులాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు ఉప్పల్ భగాయత్‌కు చెందిన రిటైర్డ్ పోలీస్ ఎస్‌ఐ సి. ప్రవీణ్ కుమార్ కుమారుడు కృష్ణ కౌండిన్య (21)గా పోలీసులు గుర్తించారు.
కృష్ణ కౌండిన్య నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఈ నెల 24న రాత్రి 7.30 గంటల సమయంలో తన స్నేహితుడు ఘన్‌కోట్ రిషబ్‌తో కలిసి ఏదులాబాద్‌లోని లివిన్ ఫామ్‌హౌస్‌లో నిర్వహిస్తున్న మరో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం కృష్ణ అపస్మారక స్థితిలో ఉన్నాడని, ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు రిషబ్ తండ్రి ప్రవీణ్ కుమార్‌కు సమాచారం అందించారు.
కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకునే సమయానికి కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రవీణ్ కుమార్ అక్టోబర్ 25న ఘట్‌కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, యువకుడి మృతికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.