HMWS Joint Director: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వాటర్ బోర్డ్ (HMWSSB) ప్రధాన కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎ. శ్రీనివాస్ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారుల తనిఖీల్లో చిక్కడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. పెద్ద మొత్తంలో నగదు తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు, నాటకీయ పరిణామాల మధ్య ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
వెంబడించి పట్టుకున్న అధికారులు
శనివారం రాత్రి శ్రీనివాస్ తన వద్ద ఉన్న భారీ నగదుతో కారులో ఇంటికి బయలుదేరారు. అదే సమయంలో ACB అధికారులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆయన కారును వెంబడించారు. రాజ్ భవన్ రోడ్డులోని ‘మెట్రో రెసిడెన్సీ’ అపార్ట్‌మెంట్స్ ఎదురుగా శ్రీనివాస్ కారును ఆపి, ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
కారులో రూ. 2.40 లక్షలు ప్రత్యక్షం
వాహనాన్ని క్షుణ్ణంగా సోదా చేయగా.. అందులో ఏకంగా రూ. 2.40 లక్షల నగదు బయటపడింది. అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించగా.. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పారు. సరైన ఆధారాలు చూపించలేకపోవడంతో అధికారులు ఆ నగదును తక్షణమే సీజ్ చేశారు.
విచారణ వేగం
ఈ ఘటనపై లోతుగా పరిశోధించేందుకు అధికారులు ఆదాయపు పన్ను (IT) శాఖకు కూడా సమాచారం అందించారు. శ్రీనివాస్ వద్ద దొరికిన ఈ సొమ్ము కాంట్రాక్టర్లు లేదా ఇతర పనుల కోసం లంచాల రూపంలో వసూలు చేసిందేనా? అనే కోణంలో ఏసీబీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. వాటర్ బోర్డ్‌లో ఆయన వ్యవహార శైలిపై కూడా ఆరా తీస్తున్నారు.
Also Read: టీజీ-ఐపాస్ సర్వర్ హ్యాక్.. హ్యాకర్లు ఏం డిమాండ్ చేశారో తెలిస్తే షాకవుతారు!