TG-iPASS Cyber attack: స్వేచ్ఛ బ్యూరో: పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన పారిశ్రామిక సింగిల్ విండో అనుమతుల పోర్టల్ ‘టీజీ-ఐపాస్’ సర్వర్ పై జరిగిన సైబర్ దాడి కలకలం సృష్టించింది. సైబర్ అటాక్ కారణంగా ఈనెల 22 రాత్రి 11:36 గంటల నుంచి పోర్టల్ పనిచేయడం ఆగిపోయింది. హ్యాకర్లు సర్వర్ ను కాంప్రమైజ్ చేసి దాంట్లోని డేటాబేస్, ఇతర ఫైళ్లను లాక్ (ఎన్‌క్రిప్ట్) చేశారు. ఫైళ్ల పేర్లకు .vgb ఎక్స్‌టెన్షన్ జోడించారు. సర్వర్ లో హ్యాకర్లు ఒక రాన్సమ్ నోట్ ఉంచారు. అందులో డబ్బులు డిమాండ్ చెయ్యలేదు. అయితే, ఓ ఈ మెయిల్ ఐడీని (డాటాలీక్స్5) సంప్రదించాల్సిందిగా పేర్కొన్నారు. సైబర్ దాడి కారణంగా రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు ఇచ్చే ఆన్ లైన్ అనుమతుల ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది.
పోలీసులకు ఫిర్యాదు..
పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ సంగా సురేష్ శనివారం సైబర్ దాడిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐటీ చట్టం సెక్షన్ 43, 66 ప్రకారం కేసులు నమోదు చేశారు. డేటా బయటికి వెళ్లిందా? లేదా? అన్నది ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ద్వారా తేలాల్సి ఉంది. కాగా, బ్యాకప్ డేటా సురక్షితంగా అందుబాటులో ఉందని పరిశ్రమల అధికారులు తెలిపారు. సాంకేతిక బృందాలు వెబ్ సైట్ పునరుద్ధరణ కోసం పని చేస్తున్నట్టు చెప్పారు. సోమవారం నాటికి పోర్టల్ సేవలు తిరిగి ప్రారంభం కావచ్చని తెలిపారు.
Also Read: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో రూ. 4 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత