Hot Air Balloon: హైదరాబాద్‌లోని మణికొండలో పెను ప్రమాదం తప్పింది. నగరంలో కొనసాగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ షోలో భాగంగా గాలిలోకి ఎగిరిన ఒక బెలూన్ సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. నేక్నాపూర్ చెరువు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. షోలో పాల్గొన్న నంబర్ 14 బెలూన్ గాలిలో ఉండగానే అకస్మాత్తుగా సాంకేతిక సమస్య తలెత్తింది. లోపల గాలి ఒత్తిడి తగ్గిపోవడంతో బెలూన్ క్రమంగా కిందికి దిగిపోయింది. అప్రమత్తమైన పైలట్ జనావాసాల మీద పడకుండా బెలూన్‌ను నేక్నాపూర్ చెరువులోని బురద ప్రాంతంలో సురక్షితంగా దింపగలిగారు.
సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు:
ప్రమాద సమయంలో బెలూన్‌లో ముగ్గురు ప్రయాణికులు ఉన్నారు. బురదలో ల్యాండ్ అయినప్పటికీ, ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమైన సహాయక బృందాలు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం బెలూన్‌ను ట్రక్కుల సహాయంతో అక్కడి నుంచి తరలించారు.
ఊపిరి పీల్చుకున్న అధికారులు:
బెలూన్ కిందకు దిగుతున్న సమయంలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే.. ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సాంకేతిక లోపానికి గల కారణాలపై నిర్వాహకులు విచారణ చేపడుతున్నారు.