Indiramma Houses: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం మంత్రి, కూసుమంచి క్యాంప్ కార్యాలయంలో కూసుమంచి మండలం ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గతంలో ఎన్నికల సమయంలో బొమ్మలు చూపించి, సినిమాటిక్ గా ప్రకటనలు చేసి మోసం చేసిన ప్రభుత్వంలా కాకుండా, అర్హులైన పేదవాడెవరూ నష్టపోకుండా ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనేదే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో 2.5 లక్షల ఇళ్లు, హైదరాబాదులో లక్ష ఇళ్లు మంజూరు చేయడమే కాకుండా, హైదరాబాద్‌లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. గ్రామీణ, తండా ప్రాంతాల్లో కూడా విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామన్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 30 వేల నుంచి 2 లక్షల 40 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఇంకా ఎంత ఖర్చయినా మూడో, నాలుగో విడతల్లో ఇళ్లు కట్టిస్తామని, అర్హులందరికీ అందజేస్తామని మంత్రి అన్నారు.
కులం, మతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుందని మంత్రి అన్నారు. ప్రతిపక్ష శాసనసభ్యుల నియోజకవర్గాల్లో కూడా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 73 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 14,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయిందని, త్వరలో మరిన్ని ఇవ్వబోతున్నామని తెలిపారు. గత 33 నెలల్లోనే కేవలం మహిళా సంఘాలకు రూ. 73 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలు అందించా మన్నారు. అదనపు కలెక్టర్ పిన్రెడ్డి శ్రీనివాస రెడ్డి, హౌజింగ్ పి.డి భూక్యా శ్రీనివాస్, కూసుమంచి మండల ఎంపీడీవో జశ్వంత్ కుమార్, తహశీల్దార్ సైదులు, హౌజింగ్ డీ.ఈ, వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Also read: గద్వాల జిల్లాలో రైస్ మిల్లర్ల భారీ స్కాంమ్.. రూ.6 కోట్ల సీఎంఆర్ ధాన్యం గోల్‌మాల్!