Jagadish Reddy: తెలంగాణ సాగు నీటి ప్రయోజనాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీకి తాకట్టు పెట్టారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ భవన్ లో శనివారం మీడియాతో మాట్లాడారు. ఉత్తర కుమారుడిలా వ్యవహరించి నల్లగొండ ను ఎండబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ లోభి తనం తోనే రాష్ట్రంలో విద్యుత్ సమస్య వచ్చిందని మండిపడ్డారు. ఉత్తమ్ కు ఛాలెంజ్ విసురుతున్నానని కన్నెపల్లి పంప్ హౌజ్ కు వెళదా నేను చెప్పిన పద్ధతి లో పంపులు ఆన్ చేయాలని నీళ్లు ఎట్లా రావో నేను చూస్తానన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా ప్రయోజనాలు పక్కన బెట్టి చంద్రబాబుకు 700 కిలోమీటర్ల దూరం కృష్ణా జలాలను తీసుకుపోయే అవకాశం ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రజల ద్రుష్టిని మళ్లించే రాజకీయాలు చేస్తోందన్నారు. కేసీఆర్ ను, బీ ఆర్ ఎస్ ను తిడితే ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. కాంగ్రెస్ పాలనలో ఒక్క కిలో వాట్ కూడా విద్యుత్ ఉత్పత్తి జరగలేదన్నారు. కేసీఆర్ నిర్మించిన కరెంటు వ్యవస్థను అలాగే నడిపితే ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా విద్యుత్ ఇవ్వవచ్చు అన్నారు. నిమిషం కూడా కరెంటు పోనివ్వకుండా చూసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. కరెంటు విషయం లో కమిషన్లు రావనే కాంగ్రెస్ సంక్షోభం తెచ్చిందని విమర్శించారు. యాదాద్రి అపుడు వద్దన్నారు ..ఇపుడు అదే దిక్కయింది. యాదాద్రి పవర్ ప్లాంట్ ను బంద్ చేసే దమ్ముందా ? అని సవాల్ చేశారు.
బొగ్గు లేని ప్రాంతం లో యాదాద్రి ని కట్టారు అంటున్న వారు బొగ్గులేని విజయవాడ ,కడపలో ఎందుకు కట్టారో చెప్పగలరా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చేతకాకపోతే నీళ్లు ఎలా ఎత్తిపోయవచ్చో మేము చెబుతామన్నారు. ప్రజలు కాంగ్రెస్ కుట్రలు గమనించాలని కోరారు. కాంగ్రెస్ వల్లనే కరువు వచ్చింది అనేది బహిరంగ రహస్యమే నన్నారు. కాంగ్రెస్ నేతలకు మూటలు సర్దుకోవడం లో ఉన్న ధ్యాస ఎల్ నినో సమస్యల పరిష్కారం లో లేదని దుయ్యబట్టారు. ప్రజలకు కావాల్సింది బూతులు కాదు భరోసా కావాలన్నారు. కరెంటు కష్టాలు తెచ్చినందుకు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ,బీ ఆర్ ఎస్ నేత ఒంటెద్దు నరసింహ రెడ్డి పాల్గొన్నారు.
Also read: సినిమా చూడటానికి కాలేజీకి సెలవా.. ఇదేం కొత్త రూల్ మల్లన్నా!