China Espionage: చైనా నిఘా ఏజెంట్లకు దేశ రక్షణకు సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేసిందనే ఆరోపణలపై ఓ ఆర్మీ అధికారి భార్యపై జమ్మూకశ్మీర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె తెలంగాణకు చెందిన మహిళ అని, ప్రస్తుతం తన భర్తతో కలిసి జమ్మూలోని గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తోందని అధికారులు తెలిపారు. ఈనెల 16న ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వివరాలు ఇలా ఉన్నాయి.
చైనాకు చెందిన కొందరు గూఢచారులు తమను తాము పెద్ద పెద్ద యూనివర్సిటీల ప్రొఫెసర్లు, విద్యావేత్తలమంటూ సోషల్ మీడియా ద్వారా ఆమెను సంప్రదించారు. విద్యావంతురాలైన ఆమెతో మొదట పర్యావరణం, భౌగోళిక రాజకీయాలపై పరిశోధనాత్మక వ్యాసాలు రాయించారు. ఆ తర్వాత మెల్లగా రక్షణ రంగానికి సంబంధించిన సున్నితమైన అంశాల వైపు మళ్లించారు. జమ్మూకశ్మీర్ లోని లైన్ ఆఫ్ కంట్రోల్ పరిస్థితులు, అరుణాచల్ ప్రదేశ్ లో జరుగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టులు, డ్రోన్ల వినియోగం వంటి వ్యూహాత్మక అంశాలపై వ్యాసాలు రాయించుకున్నారు. ఈ వ్యాసాలు రాయడానికి ఆమె చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ను ఉపయోగించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
తనను సంప్రదించింది చైనా ఏజెంట్లని తెలియక, ఆమె ఒక ‘ఇంటెలెక్చువల్ ట్రాప్’లో చిక్కుకుపోయి సున్నితమైన సమాచారాన్ని, పత్రాలను, ఫోటోలను ఎన్ క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ఛానెల్స్ ద్వారా పంచుకున్నట్టు నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆమెను విచారిస్తున్నారు. అయితే, ప్రాథమిక విచారణ దశలోనే కేసు ఉన్నందున ఆమెను ఇంకా అరెస్ట్ చేయలేదు. చైనా ఏజెంట్లకు నిజంగానే ఎంతవరకు సమాచారం చేరింది, వారికి ఆమెకు మధ్య పరిచయం ఎలా ఏర్పడింది అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also read: ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!