Jana Sena: నాయకత్వం నుంచి క్షేత్రస్థాయి కార్యకర్త దాకా ప్రతిఒక్కరి మధ్య ఆత్మీయ అనుబంధాన్ని, పరస్పర విశ్వాసాన్ని, సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో అలాయ్ బలాయ్ నిర్వహిస్తున్నామని తెలంగాణ జనసేన నాయకులు తెలిపారు. అక్టోబర్ 30, శుక్రవారం ఉదయం 9 గంటల నుండి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ‘జనసేన తెలంగాణ అలయ్ బలయ్’కార్యక్రమం జరగనుంది.
జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, మండల స్థాయి నాయకులు పాల్గొననున్నారు.
గ్రామస్థాయి వరకు సంస్థాగత సమన్వయాన్ని పెంపొందించడం. అభిప్రాయాలకు, సూచనలకు, సేవలకు సముచిత ప్రాధాన్యం కల్పించడం. పార్టీ శ్రేణుల మధ్య ప్రత్యక్ష సంబంధాలు, పరస్పర విశ్వాసాన్ని బలోపేతం చేయడం. తెలంగాణ ఆకాంక్షలు, యువత భవిష్యత్తు, విద్య, ఉపాధి, ప్రజారోగ్యం, వంటి అంశాలపై ఉమ్మడి అవగాహన పెంపొందించడం. సామాజిక న్యాయం, ప్రజాసమస్యల పరిష్కారానికి సమిష్టి కృషి, బాధ్యతాయుతమైన ప్రజాసేవా సంస్కృతిని ప్రోత్సహించడం. అలయ్ బలయ్ అంటే ఆత్మీయ ఆలింగనం మాత్రమే కాదు, మనసులను కలపడం, అపోహలను తొలగించడం నాయకత్వాన్ని కార్యకర్తలకు మరింత చేరువ చేయడం, అందరినీ ఒకే కుటుంబంగా ముందుకు నడిపించడం అనే ఉద్దేశంతో నిర్వహించనున్నారు.
పార్టీకి నిజమైన బలం పదవుల్లో కాదు, ప్రజలతో మమేకమై పనిచేసే కార్యకర్తల్లోనే ఉందనే భావనతో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన ఆశయాలను, ప్రజాసేవ విలువలను తెలంగాణ ప్రజల ఆకాంక్షలతో అనుసంధానిస్తూ ఒకే లక్ష్యంతో కలిసి పనిచేసే వాతావరణాన్ని నిర్మించడం ‘జనసేన తెలంగాణ అలయ్ బలయ్’ సమ్మేళనం ప్రధాన ఉద్దేశం.
Also read: అన్ స్టాపబుల్ సీజన్ 5 ప్రారంభం.. పస్ట్ గెస్ట్ గా మెగాస్టార్?