Vote Bachao: స్వేచ్చ బ్యూరో: ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓట్ల చోరీకి నిరసనగా నవంబరు 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో నిర్వహించే ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆదివారం కరీంనగర్‌లోని డీసీసీ భవన్‌లో ఇన్‌ఛార్జులు, ముఖ్య నేతల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఏఐసీసీ పరిశీలకులు శరత్, ఇన్‌ఛార్జి కూన శ్రీశైలం గౌడ్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్ మాట్లాడారు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిన తీరును ఇప్పటికే గ్రామగ్రామాన ప్రజలకు వివరించామన్నారు. దిల్లీలో జరిగే భారీ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.
సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ సత్తు మల్లేశం, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఛైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, సుడా మాజీ ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, నగర అధ్యక్షుడు అంజన్‌కుమార్, హుజూరాబాద్ పురపాలక ఛైర్‌పర్సన్ సుహాసిని, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, పురమల్ల శ్రీనివాస్, నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also read: సాయంత్రం పూట వేడి వేడి టీతో..ఈ చిట్టి మురుకులు సూపర్ కాంబినేషన్!