Dandu Maa Temple: ఒడిశాలోని గజపతి జిల్లాలో ఉన్న ప్రసిద్ధ ‘దండు మా అమ్మవారి ఆలయం’ (Dandu Maa temple) అందరి దృష్టి ని ఆకర్షిస్తోంది. ఏడాదిలో కేవలం 11 రోజులు మాత్రమే తెరిచి ఉండటం వల్ల భక్తుల్లో ఈ ఆలయానికి గొప్ప విశిష్టత ఏర్పడింది. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయాన్ని తెరవడంతో మరోమారు అందరి దృష్టి ఈ గుడిపై పడింది. ఈ నేపథ్యంలో ఈ ఆలయానికి సంబంధించి విశేషాలు, సంప్రదాయాలు, భక్తుల విశ్వాసాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
గణపతి జిల్లా పర్లాఖేముండి లేదా పర్లాకిమిడి (Paralakhemundi) ప్రాంతంలో కొలువుదీరిన ఈ ‘దండు మా అమ్మవారి ఆలయం’ భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. ఈ ఆలయానికి ఒడిశా నుంచే కాకుండా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ముందే చెప్పుకున్నట్లుగా ఈ ఆలయం అత్యంత ప్రత్యేకత ఏమిటంటే.. ఏడాదిలో కేవలం 11 రోజులు మాత్రమే ఇది తెరుచుకుంటుంది. మిగతా కాలమంతా ఆలయ ద్వారాలు మూసివేయబడి ఉంటాయి. తరతరాలుగా వస్తున్న ఈ విభిన్న సంప్రదాయం దసరా శరన్నవరాత్రులతో ముడి పడి ఉంది.
ఈ ఆలయం శరదీయ నవరాత్రుల (Sharadiya Navratri) సమయంలో ప్రత్యేకమైన క్యాలెండర్ను అనుసరిస్తుంది. నవరాత్రుల మొదటి రోజున ఆలయ తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు, యజ్ఞం నిర్వహిస్తారు. నవరాత్రులు ముగిసే విజయదశమి రోజు అర్ధరాత్రి వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేసి దసరా ముగిసిన రెండవ మంగళవారం రోజున మరో ఒక్క రోజు తిరిగి తెరుస్తారు. ఈ విధంగా ఏడాదిలో మొత్తం 11 రోజులు మాత్రమే ఆలయం తెరిచి ఉంటుంది. తమ పూర్వీకులు పాటించిన ఈ సంప్రదాయాన్ని తరువాతి తరాల వారు కూడా భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు.
సాధారణంగా ఏ ఆలయంలోనైనా భక్తులు ఏడాది పొడవునా పూజలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దండు మా ఆలయం ఇందుకు భిన్నం కాబట్టి రోజూ పూజా కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ.. భక్తులకు ఈ ఆలయంలోకి ప్రవేశం ఉండదు. ఈ ప్రత్యేక ఆచారానికి గల ఖచ్చితమైన చారిత్రక కారణాలు స్థానికులు చెప్పలేకపోతున్నారు. కానీ తమ పూర్వీకుల విశ్వాసాలు, సంప్రదాయాలను పాటిస్తూ నేటికీ వారు చూపిన మార్గంలో నడుస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు.
దండు మా ఆలయానికి సంబంధించి అత్యంత ఆసక్తికరమైన, అద్భుతమైన సంప్రదాయం అమ్మవారికి సమర్పించే కొబ్బరికాయ. ఆలయ ద్వారాలు మూసివేసే ముందు పూజారి ఒక కొబ్బరికాయను ఆలయం లోపల మట్టి కుండలో ఉంచుతారు. ఆ తర్వాత తదుపరి పూజా సమయం వచ్చే వరకు ఆలయం మూసివేయబడుతుంది. మరుసటి ఏడాది ఆలయ తలుపులు తిరిగి తెరిచేసరికి, ఆ కొబ్బరికాయ ఏమాత్రం చెడిపోకుండా అలాగే పచ్చిగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఆ కొబ్బరికాయను భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేస్తారని తెలియజేస్తున్నారు.
Also Read: ఒకే ఒక్క రీఛార్జ్.. ఏడాది పొడవునా ఫ్రీ కాల్స్, డేటా.. Airtel చౌకైన వార్షిక ప్లాన్స్ ఇవే!
ఆలయం ఉన్న పరలాఖేముండి ప్రాంతానికి రైల్వే స్టేషన్ ఉంది. అలాగే ఈ ప్రాంతాన్ని సందర్శించే యాత్రికులు ప్రత్యామ్నాయంగా పలాస రైల్వే స్టేషన్ను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక రోడ్డుమార్గం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నుంచి పరలాఖేముండికి రోడ్డు సౌకర్యం అందుబాటులో ఉంది. అటు విమాన మార్గంలో వెళ్లాలని భావించే వారు.. భోగాపురం విమానాశ్రయం నుంచి భువనేశ్వర్లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టుకు చేరుకోవచ్చు.
Also Read: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు.. భారీ వర్ష సూచన, హైదరాబాద్కు ఎల్లో అలర్ట్