Kasani Veeresh: స్వేచ్ఛ బ్యూరో: హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు త్వరలో తెరపడనుందా? టికెట్ రేసులో కాసాని వీరేశ్ ముదిరాజ్ పేరు ముందుకు రావడంతో గులాబీ శిబిరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని బరిలోకి దింపాలన్న వ్యూహంలో భాగంగా వీరేశ్ అభ్యర్థిత్వానికి అధిష్ఠానం మొగ్గుచూపుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, మరోవైపు ఎన్నికల కార్యాచరణను మాత్రం పార్టీ నాయకత్వం వేగవంతం చేసింది. టికెట్ ఆశిస్తున్న నేతలకు అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా బాధ్యతలు అప్పగిస్తూ.. ఓటరు నమోదు నుంచి అభ్యర్థి గెలుపు వరకు పనిచేయాలని దిశానిర్దేశం చేసింది.
సామాజిక సమీకరణాలే కీలకం..
హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం విషయంలో బీఆర్‌ఎస్ ఆచితూచి అడుగులేస్తోంది. వచ్చే ఎన్నికలకు ముందు పార్టీ రాజకీయ బలాన్ని చాటుకోవడంతోపాటు, పట్టభద్రుల్లో తిరిగి పట్టు సాధించాలన్న లక్ష్యంతో అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దించడం ద్వారా రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చన్న అంచనాలు పార్టీలో ఉంది.ఈ నేపథ్యంలో కాసాని వీరేశ్ ముదిరాజ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే ఎమ్మెల్సీ టికెట్ కోసం మరికొందరు నేతలు కూడా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తుది నిర్ణయం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ అధినేత కేసీఆర్ ఆమోదముద్ర, అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే అభ్యర్థిత్వంపై స్పష్టత రానుంది.
ఆశావహులకు కొత్త బాధ్యతలు
టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచకుండా, వారి రాజకీయ అనుభవాన్ని పార్టీ ప్రయోజనాలకు వినియోగించుకోవాలని బీఆర్‌ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో భాగంగారంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జులను నియమించి, స్థానిక నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకునే బాధ్యతలను అప్పగించింది. ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న గోషామహల్ నియోజకవర్గానికి గౌండ్ల నాగేందర్ గౌడ్, కొల్లాపూర్‌కు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డిని, గద్వాల్ కు ఆంజనేయగౌడ్ లను ఇన్‌చార్జులుగా నియమించడం ఈ వ్యూహంలో భాగమేనని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌తోపాటు ఇతర జిల్లాల్లోనూ నేతలకు బాధ్యతలు కేటాయించారు. టికెట్ ఆశావహులకు బాధ్యతలు అప్పగించడం ద్వారా పార్టీలో అసంతృప్తికి తావులేకుండా చూడటంతోపాటు, ఎన్నికల సమయంలో అందరి సేవలను వినియోగించుకోవచ్చని నాయకత్వం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఓటరు నమోదే తొలి అస్త్రం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటరు జాబితా కీలకం. అర్హులైన పట్టభద్రులను గుర్తించి, నిబంధనల ప్రకారం ఓటర్లుగా నమోదు చేయించడం పార్టీలకు ప్రధాన కార్యాచరణగా మారింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించడంతోపాటు, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమన్వయం చేయాలని నాయకత్వం సూచించినట్లు సమాచారం.ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పట్టభద్రులను చేర్చుకోవడం, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేటు రంగంలో పనిచేసే విద్యావంతులతో సంబంధాలు పెంచుకోవడం, పార్టీ విధానాలను వివరించడం వంటి అంశాలపై దృష్టి సారించబోతున్నారు.
నేతలకు ఓట్ల లక్ష్యం
కేవలం ఇన్‌చార్జులను నియమించడంతో సరిపెట్టకుండా, ప్రతి నేతకు క్షేత్రస్థాయిలో నిర్దిష్ట బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఓటరు నమోదు ఎంత జరిగింది? కొత్తగా ఎంతమంది పట్టభద్రులను చేరుకున్నారు? పార్టీకి అనుకూలంగా ఓటర్లను సమన్వయం చేయడంలో పురోగతి ఎంత? వంటి అంశాల ఆధారంగా నాయకుల పనితీరును సమీక్షించే అవకాశం ఉంది. అంతేకాదు ఓటర్ ను ఆకట్టుకునే ప్రయత్నాలు సైతం చేయాలని దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని, పార్టీ అండగా ఉంటుందని సూచించినట్లు సమాచారం.
టికెట్ తేలాల్సిందే!
కాసాని వీరేశ్ ముదిరాజ్ పేరు ప్రచారంలో ఉండగా, నాగేందర్ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, ఆంజనేయగౌడ్, సహా ఇతర నేతల పేర్లు కూడా గతంలో ఎమ్మెల్సీ టికెట్ పరిశీలనలో వినిపించాయి. దీంతో అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు నియోజకవర్గాలవారీగా ఇన్‌చార్జుల నియామకంతో పార్టీ ఎన్నికల సమరానికి సిద్ధమవుతోంది.టికెట్ ఎవరికి దక్కినా పార్టీ నేతలంతా సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థను సిద్ధం చేయడం, పట్టభద్రుల ఓటర్లను చేరుకోవడం, గెలుపు అవకాశాలను మెరుగుపర్చుకోవడం బీఆర్‌ఎస్ ముందున్న లక్ష్యాలు. అభ్యర్థి అధికారిక ప్రకటనతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల పనితీరు ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు బీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికలకు గీటురాయి కానున్నాయి.
Also Read: కృష్ణానదిలో ఘోర ప్రమాదం.. నాటుపడవ మునిగి ఇద్దరు బాలురు దుర్మరణం!