KTR: సింగరేణి సంస్థ ప్రయోజనాలను కాపాడటంతో పాటు బొగ్గు గని కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను బలహీనపరిచే, ప్రైవేటీకరణ దిశగా నడిపించే ప్రయత్నాలను అడ్డుకుంటామని, కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని తేల్చిచెప్పారు.
తెలంగాణ భవన్‌లో గురువారం సింగరేణి ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సింగరేణిలో ప్రస్తుత పరిస్థితులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, సంస్థ భవిష్యత్తు, కార్మిక సంఘం బలోపేతం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ ముప్పు నుంచి కాపాడటంతో పాటు సంస్థలో జరుగుతున్న అవకతవకలు, టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు.
గోదావరిఖని సభలో ప్రస్తావించిన సింగరేణి ఆర్థిక వ్యవహారాలు, బొగ్గు ఉత్పత్తి తగ్గుదల, టెండర్లలో అక్రమాల ఆరోపణలు, సంస్థకు రావాల్సిన నిధుల అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. సింగరేణి విషయంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో పాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని కూడా ప్రశ్నించాలని, సంస్థ ప్రయోజనాలకు విఘాతం కలిగించే నిర్ణయాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని స్పష్టం చేశారు. సింగరేణి సంస్థను కాపాడటం, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడం బీఆర్ఎస్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, లాభాల్లో వాటా, ఆధారిత ఉద్యోగాలు, వైద్య సదుపాయాలు, కార్మిక కుటుంబాల సంక్షేమం వంటి అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గతంలో కార్మికుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రస్తుత పరిస్థితులతో పోల్చి వివరిస్తూ కార్మికులకు వాస్తవాలను తెలియజేయాలన్నారు. కార్మికులకు రావాల్సిన లాభాల వాటా, బోనస్, ఇతర ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రశ్నించాలని, కార్మికుల హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.
సింగరేణి కార్మికుల సమస్యలపై బీఆర్ఎస్ రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అనంతరం సింగరేణి కార్మిక సంఘం ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్టీ, టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సమావేశంలో చర్చించారు. సింగరేణి ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు కార్మికులకు మరింత అండగా ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎదురవుతున్న సమస్యల నేపథ్యంలో కార్మికులు, సింగరేణి ప్రాంత ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల ఆదరణ పెరుగుతోందని నాయకులు తెలిపారు.
Also Read: హైదరాబాద్‌లో 87 నిమిషాల మనీ గేమ్.. దెబ్బకు రూ. 3.34 కోట్లు స్వాహా!
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, సంక్షేమ కార్యక్రమాల పునరుద్ధరణ, టీబీజీకేఎస్ బలోపేతం లక్ష్యంగా రానున్న రోజుల్లో సమన్వయంతో ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. సింగరేణి కార్మికులకు అండగా ఉంటూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల వైఖరిని ఎండగడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.