IRCTC ‘Vandarshan’ Wildlife Tour Packages: మహారాష్ట్రలోని పులుల సంరక్షణ కేంద్రాలు, వన్యప్రాణుల అందాలను పర్యాటకులకు పరిచయం చేసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త టూర్ ప్యాకేజీలను తీసుకొచ్చింది. మహారాష్ట్ర అటవీశాఖ సహకారంతో ‘వన్ దర్శన్‘ పేరుతో ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను ప్రకటించింది. నవంబర్ 19 నుంచి ఈ యాత్రలు ప్రారంభం కానున్నాయి.
ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఐదు రకాల పర్యాటక ప్యాకేజీలను రూపొందించారు. ఒక్కో యాత్ర నాలుగు రాత్రులు, ఐదు రోజుల పాటు కొనసాగుతుంది. పులులను చూడటంతో పాటు అడవుల్లోని ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్యాకేజీలు ఉపయోగపడతాయి. ఈ యాత్రల్లో భాగంగా పర్యాటకులు తాడోబా బోర్ టైగర్ రిజర్వ్ లు, తాడోబా నావేగావ్-నాగ్జీరా టైగర్ రిజర్వ్ లు, పెంచ్, ఉమ్రేడ్-పావోని-కర్హండ్లా వన్యప్రాణి అభయారణ్యం, తాడోబా, ఉమ్రేడ్-పావోని-కర్హండ్లా అభయారణ్యం, తాడోబా, టిపేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యంను చూసే అవకాశం ఉంటుంది.
ఈ ప్రత్యేక యాత్రలు రైలు ప్రయాణంతో ప్రారంభమవుతాయి. ప్రతి గురువారం ముంబై నుంచి 12105 నంబర్ విదర్భ ఎక్స్ప్రెస్లో ప్రయాణం మొదలవుతుంది. తిరుగు ప్రయాణం ప్రతి ఆదివారం గోండియా నుంచి 12106 నంబర్ విదర్భ ఎక్స్ప్రెస్లో ఉంటుంది. అయితే, ఏ స్టేషన్లో ఎక్కాలి, ఎక్కడ దిగాలి అనే వివరాలు ఎంచుకున్న ప్యాకేజీని బట్టి మారుతాయి.
ఈ ప్యాకేజీల్లో ప్రయాణికులకు రైలు టికెట్లు, అడవుల్లో సఫారీకి అవసరమైన పర్మిట్లు, వసతి, స్థానిక రవాణా సౌకర్యాలు అందిస్తారు. అడవుల్లో జంగిల్ సఫారీ కూడా యాత్రలో భాగంగా ఉంటుంది. ప్రతి యాత్రకు ఏసీ 3-టైర్లో ఆరు బెర్తులు, ఏసీ 2 టైర్లో ఆరు బెర్తులు మాత్రమే పరిమితంగా అందుబాటులో ఉంటాయి. పర్యాటకులు ముందుగానే తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా తాడోబా, ఉమ్రేడ్-కర్హండ్లా లాంటి ప్రాంతాల్లో సఫారీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో టికెట్లు, పర్మిట్ల కోసం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
వన్యప్రాణులను చూడాలనుకునే వాళ్లు, ఫొటోగ్రాఫర్లు, ఫ్యామిలీస్, ప్రకృతి ప్రేమికులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్యాకేజీలను రూపొందించారు. ప్రయాణికులు ఐఆర్సిటిసి టూరిజం అధికారిక వెబ్సైట్ irctctourism.com ద్వారా లేదంటే సంబంధిత బుకింగ్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. రైలు ప్రయాణం, వసతి, సఫారీ లాంటి ఏర్పాట్లను ఒకే ప్యాకేజీలో అందించడం ఈ యాత్ర ప్రత్యేకత. విదర్భలోని వన్యప్రాణి పర్యాటకానికి మరింతగా ప్రోత్సహించేందుకు రైల్వే ఈ ప్యాకేజీలను తీసుకొచ్చింది.
Read Also: రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!