Mamatha Clinic: మేడ్చల్ జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందించే వారిపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ ఆధ్వర్యంలో ఉప్పల్, రామంతాపూర్, బోడుప్పల్ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బోడుప్పల్‌లో అవసరమైన రిజిస్ట్రేషన్ లేకుండా, అర్హతలు లేని వ్యక్తి నిర్వహిస్తున్నట్లు గుర్తించిన మమత క్లినిక్‌ను అధికారులు సీజ్ చేశారు.రామంతాపూర్‌లోని శ్రీ గాయత్రి కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా, చట్టబద్ధమైన విధానాలను అనుసరించాలని ఆదేశించారు. ఉప్పల్‌లోని యూవీ డయాగ్నస్టిక్ సెంటర్‌ను కూడా తనిఖీ చేసి, నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ మాట్లాడుతూ.. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యమని తెలిపారు. అవసరమైన అనుమతులు లేకుండా వైద్య కేంద్రాలను నిర్వహించడం, అర్హతలు లేని వ్యక్తులు వైద్య సేవలు అందించడం, పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని ఉల్లంఘించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు.
ప్రజల ప్రాణాలు, ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లాలోని ఆసుపత్రులు, క్లినిక్‌లు, డయాగ్నస్టిక్ కేంద్రాలన్నీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు, అనుమతులు పొందాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించాలని సూచించారు. నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, పర్యవేక్షణ కొనసాగుతాయని తెలిపారు. ఈ తనిఖీల్లో కీసర డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ గీత, జిల్లా ఎంసీహెచ్/సీఐఏ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ గీత, అదనపు ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ పవన్ రెడ్డి, డిప్యూటీ డెమో వసంత కుమారి పాల్గొన్నారు.
Also read: ఆదర్శ కుటుంబం సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా టికెట్ ధరలు పెంపు!