
Talasani : మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూటే సెపరేట్. అప్పుడప్పుడు ఆయన మంత్రి అన్న విషయాన్ని మర్చిపోతారేమో.. చాలా దిగజారిపోయినట్టు వ్యవహరిస్తారు. హైదరాబాద్ లో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ వేళ ఆయన వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ముందు వెళుతున్నారు. తలసాని ఆయన వెనుక వెళ్తున్నారు. ఇంతలో ఎవరో ఓ వ్యక్తి వారి మధ్యలోకి వచ్చారు. అంతే తలసానికి చిర్రెత్తుకొచ్చింది. కోపం నషాళానికి అంటినట్టుంది. నాలుక మడతపెట్టారు. కాలర్ పట్టుకొని ఆ వ్యక్తిని వెనక్కి లాగేశారు. అతణ్ని కొట్టేందుకు చేయెత్తారు. ఒక్కటి పీకపోయారు. కానీ ఎందుకో తమాయించుకొని ఆగిపోయారు. నాకు, కేటీఆర్‌కు మధ్య అడ్డుగా వస్తావా? అన్నట్టుగా ఉంది ఆయన తీరు.
తలసాని దురుసు ప్రవర్తన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏంటిది మంత్రిగారు.. ఇదేనా మీ హుందాతనం? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ అనేకసార్లు ఆయన వ్యవహారశైలితో వివాదస్పదమయ్యారు. బోనాల సందర్భంగా అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఆలయ ప్రాంగణంలోనే ఉమ్మివేశారు తలసాని. దీంతో ఆయన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. చేతలేకాదు మాటతీరుతో తలసాని అనేకసార్లు వివాదాల్లో ఇరుక్కున్నారు. అయినా తన తీరు మార్చుకోలేదు. అదే తననైజం అన్నట్లు ఉంటుందని ఆయన తీరు.
తలసాని కొట్టబోయిన వ్యక్తి సాధారణ బీఆర్ఎస్ కార్యకర్త కాదు.. భైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ గిరిజన ఉద్యమకారుడు రాజేష్ బాబు. హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాజేశ్ బాబునే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెనక్కి నెట్టేసి చెంపపై కొట్టే ప్రయత్నం చేశారు. దీంతో గిరిజన సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి.
ఓయూలో మంత్రి తలసాని దిష్టిబొమ్మను గిరిజన విద్యార్థులు దహనం చేశారు. గిరిజన నాయకుడిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడాన్ని తప్పుపట్టారు. మంత్రి వ్యవహరించిన తీరును ఖండించారు. తలసానిని మంత్రి వర్గం నుంచి తొలగించాలని కోరారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైఖరిపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండల గిరిజన నాయకులు నిరసన తెలిపారు. మంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భైంసా బస్టాండ్ వద్ద రాజేశ్‌బాబు అనుచరులు ఆందోళన చేశారు. గిరిజనులకు తలసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.