Nagarkurnool: నాగూర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా చెలరేగిన వివాదం, ఒకే కుటుంబంలోని ముగ్గురిపై మారణాయుధాలతో దాడికి దారితీసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పోలీసులు అందించిన వివరాల ప్రకారం, కల్వకుర్తి మండలం సంజాపూర్ గ్రామానికి చెందిన గుర్రం మల్లేష్‌కు, వెల్దండ మండలం చెరుకూరు గ్రామానికి చెందిన శిరీషతో సుమారు సంవత్సరం క్రితం వివాహం జరిగింది. అయితే, మల్లేష్‌కు పెళ్లికి ముందు నుండే మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ సంబంధం విషయం ఇటీవల శిరీష కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
ఈ క్రమంలో, శిరీష బంధువులు సంజాపూర్‌లోని మల్లేష్ ఇంటిపై దాడికి తెగబడ్డారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మల్లేష్‌పై కోపంతో, అతని కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెంట తెచ్చుకున్న వేట కొడవళ్లతో మల్లేష్ తండ్రి జంగయ్య, తల్లి అలివేలు, మరియు తమ్ముడు పరమేష్‌పై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Car Accident: చేవేళ్లలో మరో ప్రమాదం.. మర్రి చెట్టును ఢీకొట్టిన కారు.. స్పాట్‌లోనే ఐదుగురు..
దాడి అనంతరం నిందితులు పరారయ్యారు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాధితులను గమనించిన స్థానికులు, వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితులైన శిరీష బంధువుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వివాహేతర సంబంధమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.