CM Revanth Reddy: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, పాస్టర్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ సమస్యలను గురించి వివరించారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో.. పాస్టర్లు రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతేగాక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు లక్ష్మీకాంత రావు, శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, ఏఐసీసీ మైనార్టీ విభాగం ఉపాధ్యక్షుడు అనిల్ థామస్ తదితరులు హాజరయ్యారు.
సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌ల రాజకీయ వ్యూహాలపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. భారత్ జోడో పాదయాత్ర ద్వారా రాహుల్ గాంధీ దేశంలోని మైనార్టీలకు భరోసా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. ‘బీఆర్‌ఎస్ పార్టీని కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్‌ఎస్ కు ఎనిమిది చోట్ల డిపాజిట్ రాలేదంటే, ఆ పార్టీ ఆత్మహత్య చేసుకుని బీజేపీకి అవయవ దానం చేసిందని అర్థం చేసుకోవచ్చు’ అని విమర్శించారు. మోదీకి మద్దతు ఇస్తున్న కేసీఆర్ ప్రమాదకరమని, కారు గుర్తుకు ఓటేస్తే కమలం గుర్తుకు వేసినట్లేనని ఆయన అభిప్రాయపడ్డారు.
జూబ్లీహిల్స్‌లో మైనార్టీలను మభ్యపెట్టడానికి కుట్ర జరుగుతోందని సీఎం ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి అప్పగించి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు స్పందించకపోవడం, అలాగే కార్ రేస్ కేసులో కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ ఇప్పటి వరకు అనుమతి ఇవ్వకపోవడం వెనుక బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య రాజకీయ ఒప్పందం ఉందేమోనని ఆయన ప్రశ్నించారు.దేశం కోసం సర్వం త్యాగం చేసిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారించారని, కానీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను మాత్రం విచారణకు పిలవడం లేదని సీఎం పేర్కొన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం అయ్యే పరిస్థితి ఉందని, గతంలో కవిత కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారని గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసేందుకు జూబ్లీహిల్స్‌ను ప్రయోగశాలగా చూస్తున్నాయని ఆయన అన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. ‘కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క దళితుడే మంత్రిగా ఉన్నాడు. కానీ మా మంత్రివర్గంలో నలుగురు దళితులకు మంత్రులుగా అవకాశం కల్పించాం. అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్‌కి అవకాశం ఇచ్చాం. అత్యంత నిరుపేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ విధానం’ అని స్పష్టం చేశారు. చివరగా.. జూబ్లీహిల్స్‌లో మోదీ, కేసీఆర్ ఒకవైపు నిలబడితే.. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మరోవైపు నిలబడ్డారని.. ప్రజలు సరైన నిర్ణయం తీసుకుంటారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ALSO READ: Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్‌కు కవిత గండం