Kolikapudi Srinivasa Rao: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదంపై వారిద్దరు మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముందు హాజయ్యారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు గట్టిగానే మాట్లాడారంట. పార్టీలో ఎలా ఉండాలో తెలియదా? వ్యక్తిగత విమర్శలతో పార్టీ పరువు బజారుకీడుస్తారా అని నిలదీశారంట.. ఆ క్రమంలో వారిపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న వివాదంపై మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశం ముగిసింది. సుమారు నాలుగు గంటలపాటు సమావేశం జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటు క్రమశిక్షణ కమిటీలోని కొనకళ్ల నారాయణరావు, వర్ల రామయ్య, ఎంఏ షరీఫ్, పంచుమర్తి అనురాధ ఎదుట కొలికపూడి హాజరై వివరణ ఇచ్చారు.
తన వాదనను నివేదిక రూపంలో కమిటీకి అందజేశారు. విచారణ అనంతరం ఎమ్మెల్యే కొలికపూడి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎంపీ కేశినేని చిన్ని క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. ఇద్దరి వివరణలు తీసుకున్న కమిటీ చంద్రబాబుకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపింది.
పార్టీ క్రమశిక్షణ కమిటీకి తాను చేసిన ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలు ఇచ్చానని తిరువూరు ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాస్ తెలిపారు. క్రమశిక్షణ కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు స్పష్టంగా చెప్పానన్నారు. తిరువూరు నియోజకవర్గంలో విభేదాలకు కారణమైన అనేక విషయాలను క్రమశిక్షణ కమిటీ ముందుంచానని వెల్లడించారు. పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.
తాను చంద్రబాబుకి వీరభక్తున్ని అని, తెలుగుదేశం పార్టీయే తనకు దైవమని ఎంపీ కేశినేని చిన్ని వెల్లడించారు. చంద్రబాబు తమకు సుప్రీం అని తేల్చిచెప్పారు. తనకు తిరువూరులో జరిగిన అవమానం కంటే ఎమ్మెల్యే వల్లే పార్టీకి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. తిరువూరు నియోజకవర్గ కార్యకర్తల అభిష్టం మేరకే పార్టీ నిర్ణయం తీసుకోవాలని చిన్ని చెప్పారు.
గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రూ. 5కోట్లు తీసుకున్నారని, వాటి బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇవిగోనంటూ కొలికపూడి ఇటీవల తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టడం కలకలం రేపింది. తర్వాత మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్‌లో పెట్టారు. ‘ఎప్పుడు పడితే అప్పుడు, ఎవడు పడితే వాడు రావడానికి తిరువూరు పబ్లిక్ పార్క్ కాదు. నేను జగన్‌పై పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. రాజ్ కెసిరెడ్డి, చెవిరెడ్డి ఇచ్చిన డబ్బులతో రాలేదు’ అంటూ పోస్టులు పెట్టారు. ‘పదవులను అమ్ముకున్నది ఈ వైఎస్సార్సీపీ నాయకులకే’ అంటూ ఫొటోలతో మరికొన్ని పోస్టులు పెట్టారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే మధ్య కొంతకాలంగా తిరువూరు కేంద్రంగా నడుస్తున్న అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది.
ఈ సందర్భంగా కొలికపూడి శ్రీనివాసరావును పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు గట్టిగా హెచ్చరించారంట. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట కొలికపూడి ఒక మాటకు మరో మాటకూ పొంతన లేకుండా మాట్లాడినట్టు తెలిసింది. దాంతో కేశినేని చిన్నిపై కొలికపూడి చేసిన తీవ్రమైన ఆరోపణలకు ఆధారాలున్నాయా? అని క్రమశిక్షణ కమిటీ సభ్యులు నిలదీసినట్టు తెలిసింది. ఆయన స్పష్టమైన సమాధానం చెప్పలేదని సమాచారం.
ఎంపీ తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని… కిషోర్ అనే వ్యక్తిని పెట్టుకొని ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు… రెండు వందల పేజీల ఆధారాల్ని పార్టీ క్రమశిక్షణ సంఘానికి కొలికపూడి సమర్పించారంట. మరోవైపు కేశినేని చిన్ని తనకు నాకు సొంత ఏజెండా ఏమీ లేదని …. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో తనకంటే పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందని క్రమశిక్షణ సంఘం సభ్యులతో చెప్పారంట.
వీరిద్దరి వివరణలను క్రోడీకరించి.. తమ అభిప్రాయాలతో క్రమశిక్షణ కమిటీ సభ్యులు పల్లా శ్రీనివాసరావుకు నివేదిక సమర్పించనున్నారు. దీనిపై చంద్రబాబు లండన్ నుంచి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్తున్నారు. ఈ వివాదంపై మంత్రి నారా లోకేష్‌కు సైతం క్రమశిక్షణ కమిటీ నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. మరి ఈ వివాదానికి టీడీపీ అధిష్టానం ఎలా తెర దించుతుందో చూడాలి.
Story by Apparao, Big Tv