Kalvakuntla Kavitha: జూబ్లీహిల్స్ బైపోల్స్ వేళ గులాబీ పార్టీ శ్రేణుల్లో గుబులు మొదలైందంట. జాగృతి అధ్యక్షురాలు కవిత ఇష్యూ బీఆర్ఎస్‌లో హాట్ టాపిక్‌గా మారి ఆమె ప్రభావం ఉప ఎన్నికలలో పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అని క్యాడర్ ఆందోళన చెందుతోందంట. బీఆర్ఎస్ నేతలపై కవిత సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక గులాబీ పార్టీ శ్రేణులు సతమతమవుతున్నట్లు కనిపిస్తున్నాయి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే బీఆర్ఎస్‌కు విపక్షాల కంటే జాగృతి అధ్యక్షురాలు కవితే పెద్ద గండంగా మారారంటున్నారు. కవిత గులాబీ పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ జనంబాట పట్డారు. అటు కవిత వ్యవహారాన్నే ప్రచార అస్త్రంగా మలుచుకుంటోంది కాంగ్రెస్.. ఆ క్రమంలో భవిష్యత్తులోనూ భవిష్యత్తులోనూ కవిత వల్ల బీఆర్ఎస్‌కు సమస్యే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..
మొత్తానికి బీఆర్ఎస్‌కు కవిత ఫీవర్ పట్టుకున్నట్లే కనిపిస్తోంది.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ పార్టీలో కవిత అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆమె పార్టీకి దూరమైన తర్వాత హైదరాబాద్‌కే పరిమితం అవకుండా రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. సొంత పార్టీలో తనకు జరిగిన అన్యాయాలను తనను కలుస్తున్న నాయకులకు, కార్యకర్తలకు వివరిస్తున్నారు. అదే ఇప్పుడు గులాబీ పార్టీ నేతలను ఆత్మరక్షణలో పడేస్తోంది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా తిరిగి చేజికించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్‌కు ప్రచారంలో కవిత ఇష్యూ తలనొప్పిగా మారిందంట
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సొంత కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కవిత తన జనంబాట పర్యటనలో పదే పదే ప్రస్తావనకు తీసుకొస్తున్నారు..ఇక కేటీఆర్‌కు సొంత బావ అయిన తన భర్త బ్రదర్ అనిల్ ఫోన్ కూడా ట్యాప్ చేయడంపై కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తన ఫోన్ ట్యాప్ చేయడం వరకు సహించాను కానీ, తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఏంటని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే గులాబీ పార్టీ వల్ల నష్టపోయినట్లు భావిస్తున్న నాయకులను, కార్యకర్తలను కలుస్తుండటం వారికి మద్దతు తెలపడం బీఆర్ఎస్ కు ఒక మైనస్ గా మారుతోందంట. కొద్ది రోజుల్లో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మొదలుకొని రాబోయే ప్రతి రాజకీయ అంశంలోనూ కవిత ఇష్యూ చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో కవిత అంశం కాంగ్రెస్ కు రామబాణంలా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఈ అంశాపకపి ప్రచారంలో అనేకమార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. “సొంత చెల్లికే అన్యాయం చేసినవాడు పక్కింటి ఆడబిడ్డకు ఏం న్యాయం చేస్తాడు? పుట్టింటిపై ఏ ఆడబిడ్డ కూడా ఆరోపణలు చేయదు కానీ సొంత వారిపైనే కవిత బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు” అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారంలో బీఆర్ఎస్‌ను డిఫెన్స్‌లో పడేస్తున్నారు.
కుటుంబంలోని వ్యక్తికే అన్యాయం చేస్తే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటన్న ప్రశ్నను లేవనెత్తుతూ బీఆర్ఎస్ అగ్రనాయకత్వాన్ని ఇరుకున పడేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. ఫలితంగా ఉపఎన్నికల బరిలో ఈ అంశం ఓటర్లను ప్రభావితం చేసే స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఇక కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులు.. ముఖ్యంగా కేటీఆర్ ఎలా స్పందించాలో తెలియని గందరగోళ పరిస్థితుల్లో ఉన్నట్లు గులాబీ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది.
బహిరంగంగా కవిత ఆరోపణల పైన స్పందిస్తే కుటుంబ కలహాలను తానే రోడ్డున పడేసినట్లు అవుతుందని భయం ఒకపక్క.. మౌనంగా ఉంటే కవిత ఆరోపణలను అంగీకరించినట్లు అవుతుందని కేటీఆర్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని గులాబీ పార్టీ శ్రేణులు అంటగున్నాయి. అయితే కవితను కుటుంబ సభ్యురాలిగా భావించి సంయమనం పాటిస్తున్నానని కేటీఆర్ చెప్తున్నా కూడా.. కవిత మాత్రం తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంలో వెనక్కి తగ్గడం లేదు.
తమ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ ఆడబిడ్డ అని, ఆమెను గెలిపించండి అంటూ తన రోడ్ షోలలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ, సొంత ఆడబిడ్డకే అన్యాయం చేసిన కేటీఆర్ ఇతరులకు న్యాయం ఎలా చేస్తారని కాంగ్రెస్ నాయకులు నిలదీస్తున్నారు. చూడాలి మరి.. కవిత అంశం జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.
Story by Apparao, Big Tv