FSL Fire Accident: హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబరేటరీ (TSFSL)లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ భవనం హై సెక్యూరిటీ జోన్‌లో ఉన్నప్పటికీ.. మంటలు అన్ని అంతస్తులకు వేగంగా విస్తరించడం ఆందోళన కలిగించింది.
మంటలు గమనించిన వెంటనే స్థానికులు, సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో భవనంలో నలుగురు ఉద్యోగులు ఉండగా.. వారు అప్రమత్తమై సురక్షితంగా బయటపడ్డారు. అయితే.. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన ఒక వార్డు బాయ్ గాయపడటంతో.. అతడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
దేశంలోనే హై-ప్రొఫైల్ కేసుల పరిశోధనలో ఈ ల్యాబ్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా.. నేర పరిశోధనకు సంబంధించిన ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ జరుగుతాయి. 2021లో ఏర్పాటు చేసిన అత్యాధునిక మోలిక్యులర్ బయాలజీ ల్యాబ్ కూడా ఇక్కడే ఉంది. మొదటి అంతస్తులో కంప్యూటర్లు, సర్వర్లు ఉన్నాయి. ఈ ప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక యంత్రాలు, పరికరాలు దగ్ధమైనట్లు తెలుస్తోంది. అయితే.. ఏయే ఫైళ్లు, ఎవిడెన్స్ (సాక్ష్యాలు) తగులబడ్డాయనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసుతో పాటు పలు కీలకమైన కేసుల రిపోర్టులు ఇక్కడి నుండే రావాల్సి ఉంది. అత్యంత భద్రత ఉండే చోట.. కీలకమైన ఫైళ్లు ఉన్న సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1967లో ప్రారంభమై.. 2014లో తెలంగాణ రాష్ట్ర ల్యాబ్‌గా రూపాంతరం చెందిన ఈ సంస్థలో జరిగిన ఈ నష్టం నేర పరిశోధనలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని పలువురు కోరుతున్నారు.
Also Read:మేడారం హుండీ లెక్కింపు.. వామ్మో రెండో రోజు ఇంత ఆదాయమా!
HYD: నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం pic.twitter.com/FEy6sl61Uv
— ChotaNews App (@ChotaNewsApp) February 7, 2026