Pawan Kalyan : తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేపట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రెండోరోజు కొత్తగూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. సింగరేణిలో ఉద్యోగాలు రావాలన్న బీజేపీ అధికారంలోకి రావాలని స్పష్టం చేశారు.
బీజేపీతో పొత్తు కోసం 26 మంది జనసైనికులు త్యాగం చేశారని తెలిపారు. తనకు తెలంగాణలో అన్ని పార్టీల నాయకులతో పరిచయాలు ఉన్నాయన్నారు. కేసీఆర్, కేటీఆర్ తో పరిచయం ఉన్నా.. తన మద్దతు బీజేపీకేనని తేల్చిచెప్పారు. బీజేపీ, జనసేన తరఫున బరిలోకి దిగిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
వైఎస్ హయాంలో జలయజ్ఞం పేరుతో దోపిడీ జరిగిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. కౌలు రైతులను చులకనగా చూడటం సరికాదన్నారు. గత పాలకులు చేసిన తప్పే ఇప్పుడు మళ్లీ జరుగుతోందన్నారు. కొత్తగూడెంలో ఉపాధి అవకాశాలేవన్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి జరుగుతోందని వివరించారు.
నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని పవన్ అన్నారు. నాడు రాష్ట్ర ఏర్పాటు కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేశారని గుర్తు చేశారు. నేడు పేపర్ల లీకులతో ఎంతోమంది నిరుద్యోగులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే యువతకు జనసేన అండగా నిలబడుతుందన్నారు.
.
.
.