పండుగ సీజన్ లో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా భారతీయ రైల్వే పకడ్బందీ చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది. దసరా, దీపావళి, ఛత్ పూజా సందర్భంగా దేశ వ్యాప్తంగా 12 వేల ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ పండుగ సందడి మొదలయ్యింది. ఇప్పటికే విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో నగరాలు, పట్టణాల్లో ఉండే ప్రజలు సొంతూళ్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. బస్సులు, రైళ్లకు సంబంధించి ముందస్తు రిజర్వేషన్లు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇండియన్ రైల్వే తెలంగాణ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. ముంబై నుంచి తెలంగాణకు రాకపోకలు కొనసాగించే ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఉండటంతో ప్రత్యేక రైలును ప్రకటించింది. మహారాష్ట్రలోని ముంబై, బీవండి ప్రాంతాలకు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ నుంచి పెద్ద సంఖ్యలో ఉపాధికోసం వెళ్తారు. వలస కార్మికులు ఇబ్బందులు లేకుండా పండుగ ప్రయాణం చేసేందుకు ముంబై-కరీంనగర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది. ఈ మేరకు సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.
01153 నెంబర్ గల ప్రత్యేక రైలు ఈ రైలు ఈ నెల 30 నుంచి నవంబరు 25 వరకు ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ముంబైలోని లోక్ మాన్య తిలక్ టెర్మినల్ (LTT) నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు కరీంనగర్ కు వస్తుంది. తిరుగు ప్రయాణంలో కరీంనగర్ నుంచి బుధవారం సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరుతుంది. గురువారం మధ్యాహ్నం 1.40 గంటలకు ముంబైకి చేరుకుంటుంది.
Read Also: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!
ఇక ముంబై- కరీంనగర్ ప్రత్యేక రైలు పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తెలంగాణలో కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల్లో ఆగుతుంది. ఈ రైలు పండుగ రద్దీని తగ్గించడంతో పాటు బాసర, నాసిక్, షిర్డీ లాంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు కూడా అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ముంబైలో ఉంటున్న తెలంగాణ కార్మికులు పండుగలకు స్వగ్రామాలకు రావడానికి అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ నిర్ణయంతో వేలాది మంది ప్రయాణీకుల పండుగ ప్రయాణం మరింత ఈజీ కానుందన్నారు. ప్రయాణీకులు ఈ రైలును ఉపయోగించుకుని ఇబ్బంది లేకుండా పండుగ ప్రయాణం చేయాలని సూచించారు. అటు ముంబై-కరీంగనర్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించడం పట్ల ప్రయాణీకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: వావ్.. జపాన్ స్లీపర్ రైలు ఇలా ఉంటుందా? బెర్తులు భలే ఉన్నాయే!