Big Stories

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Telangana in Debt Trap | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావ సమయంలో రాష్ట్రానికి రూ.72 వేల 658 కోట్లు అప్పులున్నాయి. కానీ దాదాపు పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఈ అప్పులు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లుకు చేరుకున్నాయి. అంటే దాదాపు 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ పదేళ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మరి ఈ 6 లక్షల కోట్ల అప్పులతో కేసీఆర్ సర్కార్ ఏం చేసింది? ఆ స్థాయిలో రాష్ట్రానికి ఆస్తులు కానీ.. అభివృద్ధి కానీ.. కనబడడం లేదు.

- Advertisement -

తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇటీవలే శ్వేతపత్రం విడుదల చేసింది.ఈ శ్వేతపత్రం పరిశీలిస్తే.. తెలంగాణ ఆర్థికంగా బలహీన స్థితిలో ఉన్నట్లు అర్థమవుతోంది. ఉద్యమ పోరాటంతో సాధించుకున్న తెలంగాణ.. నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు అంశాలపై ఏర్పడింది.

- Advertisement -

ఈ మూడింటిలో నిధుల గురించి మాట్లాడుకుంటే.. తెలంగాణ ఏర్పడినప్పుడు రాష్ట్రం మిగులు బడ్జెట్‌లో ఏర్పడింది. కానీ పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడితప్పి ఇప్పుడు రోజూవారీ ఖర్చుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓడీ ద్వారా అంటే కేంద్రం, ఆర్‌బిఐ నుంచి అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఎలా వచ్చింది? చాలా సింపుల్.. మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆదాయం కంటే చేసే ఖర్చు ఎక్కువ.

తెలంగాణ బడ్జెట్ కు ప్రభుత్వం చేసే వాస్తవ వ్యయానికి 20 శాతం తేడా ఉందని తెలుస్తోంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమ బడ్జెట్ అంచనాలకు వాస్తవ వ్యయాల మధ్య ఒక Big Difference కనిపిస్తోంది. ప్రభుత్వానికి వచ్చే రాబడిలో 34 శాతం రుణాలపై వడ్డీ చెల్లింపులకే సరిపోతోంది. మరో 35 శాతం ఉద్యోగుల జీతాలకు, పెన్షన్లకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అంటే వచ్చే ప్రతి వంద రూపాయల ఆదాయంలో 69 రూపాయలు జీతాలు, వడ్డీలకే సరిపోతోందంటే ఇది చాలా ఆందోళన కలిగించే విషయం.

వడ్డీల కోసం ఇంత అధికంగా ఎందుకు ఖర్చు చేయాల్సి వస్తోందో ఒకసారి చూద్దాం.

గత ప్రభుత్వం ఆదాయం లేని కార్పొరేషన్ల పేరు చెప్పి అధిక వడ్డీకి రుణాలు తీసుకుంది. తీసుకున్న అప్పులలో 95శాతం అప్పులు 5 కార్పొరేషన్ల మీద తీసుకుంది. మార్కెట్ వడ్డీ కంటే అధిక వడ్డీ రేటుకి అప్పులు చేసింది. మార్కెట్ వడ్డీ 7.63% ఉంటే.. గత ప్రభుత్వం 10.49% వడ్డీతో అప్పులు తీసుకుంది. ఈ భారీ వడ్డీలే ఇప్పుడు తెలంగాణను ఆర్థికంగా కుంగదీస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టుపై 9.69 శాతం ఇంట్రెస్ట్ రేటుతో 74వేల 599 కోట్లు అప్పు తీసుకుంటే. తెలంగాణ డ్రికింగ్ వాటర్ కార్పొరేషన్‌పై 9.48 శాతం వడ్డీతో రూ.20వేల 200 కోట్ల లోన్ తీసుకుంది. అలాగే వాటర్ రిసోర్స్ కార్పొరేషన్ పై 10.49% వడ్డీ తో 14వేల 60 కోట్ల అప్పు చేసింది. ఇంకా హౌసింగ్ కార్పొరేషన్ పై లోన్ 6 వేల 470కోట్లు, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పై లోన్ 2 వేల 951కోట్లు అప్పు చేయడంతో ఈ అధిక వడ్డీల భారం రాష్ట్ర అభివృద్దికి అడ్డుగా నిలుస్తోంది.

రాష్రం ఏర్పడినప్పుడు అంటే 2014-2015 నాటికి తెలంగాణ మొత్తం అప్పులు రూ.72 వేల 658 కోట్లు. కానీ ప్రస్తుతం ఈ అప్పుల గణాంకాలు రూ.6 లక్షల 71 వేల 757 కోట్లుకు చేరుకున్నాయి.
అంటే రాష్ర్టం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం సగటున 24.5 శాతం అప్పు పెరిగింది. ఈ పదేళ్లలో తీసుకున్న అప్పులతో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదని స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకున్న అప్పు దాదాపు రూ.6 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి ఈ 6 లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులు కానీ అభివృద్ధి కానీ కనిపిస్తున్నాయా?

2015-2016 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర రుణ, GSDP 15.7 శాతం మాత్రమే ఉంది. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోల్చితే అత్యల్పం. అలాంటిది 2023-2024 సంవత్సరానికి ఈ గణాంకాలు పెరిగి 27.8 శాతానికి చేరుకుంటాయని అంచానా.

GSDP(Gross State Domestic Product) అంటే ఒక సంవత్సర కాలంలో రాష్ట్రానికి వచ్చిన ఆదాయం. సాధారణంగా GSDP Borrowing limit అంటే GSDPపై రాష్ట్రం తీసుకునే రుణ పరిమితి 3.5 శాతానికి మించకూడదు. కానీ అభివృద్ధిని, పెట్టుబడుల ద్వారా ఆర్జించే ఆదాయాన్ని చూపి పలు రాష్ట్రాలు పరిమితికి మించి రుణాలు పొందుతున్నాయి. అయితే తెలంగాణ విషయంలో పరిమితికి మించి రుణాలు కనిపిస్తున్నాయి కానీ ఆ స్థాయి ఆస్తులు, అభివృద్ధి కనబడడం లేదు.

2023-2024 సంవత్సరానికి రాష్ట్ర FRBM రుణాల అంచనా రూ.3 లక్షల 89 వేల 673 కోట్లు. అంటే తెలంగాణ రాష్ట్రం చాలా వేగంగా అప్పుల ఊబిలో చిక్కుకుంటోందని అర్థం. బడ్జెటేతర రుణాలు పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం.

FRBM అంటే Fiscal Responsibility and Budget Management Act.. ఈ చట్ట ప్రకారం ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల మధ్య ఒక సమతుల్యత అంటే balance ఉండాలి. అలా చేయకుండా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసి వెళ్లిపోతే.. తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో పడతాయి. అందు కోసమే అప్పులు తీసుకునేటప్పుడు అది LIMITలోనే ఉండాలి. FRBM చట్ట ప్రకారం ఒక రాష్ట్ర ద్రవ్య లోటు 3.5 శాతానికి మించకూడదు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే 2014లో ప్రభుత్వం వద్ద 100 రోజులకు ఖర్చు చేయగల నిధులు బ్యాలెన్స్ ఉండేవి. కానీ ఇప్పుడా బ్యాలెన్స్ పది రోజులకు తగ్గిపోయిందంటే.. ఉన్న రిజర్వ్ నిధులను గత ప్రభుత్వం విచ్చలవిడిగా ఖర్చు చేసిందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. రోజువారి ఖర్చులకు కూడా వేస్ అండ్ మీన్స్ ద్వారా రిజర్వ బ్యాంక్‌పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది.

పైగా అభివృద్ధికి కీలకమైన విద్య, వైద్య రంగాలకు సరిపడా నిధులు ఖర్చు చేయలేదు. విద్య, వైద్య రంగాల అభివృద్ధిపైనే రాష్ట్రాలు, దేశాల అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అలాంటిది తెలంగాణలో సరిపడా ఆదాయం ఉండి కూడా గత ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసింది.

కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న రుణాలు వీటికి అదనం. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి ప్రాజెక్టుల కోసం ఆయా కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వం గ్యారంటీగా ఉండి తీసుకున్న వివరాలు వెల్లడించలేదని కాగ్ పలుమార్లు తన వార్షిక రిపోర్ట్ లో చెబుతూనే వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 97,449 కోట్లను ఆంధ్రాబ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, బరోడా బ్యాంకు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా తీసుకుంది గత కేసీఆర్ సర్కార్. వీటికి 2035 ఆగస్టుకల్లా వడ్డీతో సహా అసలు చెల్లించాల్సి ఉంది. లిఫ్టుల వినియోగానికి అయిన విద్యుత్ బిల్లుల చెల్లింపు కూడా దాదాపు 9,200 కోట్లు డిస్కంలకు బకాయి పడింది రాష్ట్ర ప్రభుత్వం. మిషన్ భగీరథకు ఖర్చు చేసిన దాంట్లో దాదాపు 90% అంటే 23,984 కోట్లు రుణం రూపంలో తీసుకున్నదే.

కార్పొరేషన్ల ద్వారా పరిమితికి మించి అప్పులు చేయడంతో గతేడాది ఏప్రిల్ నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ఆంక్షలు విధించింది. రిజర్వుబ్యాంకు ద్వారా తీసుకునే అప్పుల్లో కోత పెట్టింది. ఆ ఆంక్షలు ఈ ఏడాది కూడా కంటిన్యూ అవుతున్నాయి. కార్పొరేషన్లకు ప్రభుత్వ గ్యారంటీతో చేసిన అప్పులపై గత ప్రభుత్వం లెక్కలు చూపలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయడంతో బండారం బయటపడింది.

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరథ లాంటి ప్రాజెక్టుల కోసం అప్పులు తీసుకున్న గత సర్కార్ ను తిరిగి చెల్లింపులు చేయడానికి ఉన్న మార్గమేంటని కేంద్ర ఆడిటింగ్ సంస్థ కాగ్ తన రిపోర్టుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క పైసా ఆదాయం రాకపోగా ప్రతి ఏటా పంపుల వినియోగం కోసం విద్యుత్ బిల్లుల చెల్లింపులు మోయలేని భారంగా ఉంటుందని, అప్పులు తీర్చడానికి మార్గమేమిటని అప్పటి బిఆర్ఎస్ సర్కార్‌ను నిలదీసింది. మిషన్ భగీరథ విషయంలోనూ ఇదే పరిస్థితి.

గత ప్రభుత్వం సింపుల్ గా అయ్యే పనులకు కూడా రుణాలు తీసుకొని భారీగా ఖర్చు పెట్టింది. ఇప్పుడా అప్పులు కొత్త ప్రభుత్వంపై భారం మోపాయి. అవసరం లేకున్నా కొన్ని పనులను ముందేసుకోవడం, వాటికి ఎక్కువగా ఖర్చు పెట్టడం వంటి చర్యలతో భారం పెరిగిపోయింది. పైగా కేంద్ర ప్రభుత్వం నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోకపోవడం, ప్రతి దానికి అప్పుల పైనే ఆధారపడడంతో పరిస్థితి మొత్తం గందరగోళంగా తయారైంది. గతంలో చేసిన అప్పుల్ని తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోంది అదీ లెక్క.

దశాబ్ది వేడుకల సందర్భంగా గత సర్కార్ ప్రగతి నివేదిక అంటూ ఓ రిపోర్ట్ ను ప్రచురించింది. రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, దళితబంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి లాంటి పథకాలతో ప్రజలకు లబ్ది చేకూరినట్లు తెలిపింది. తలసరి ఆదాయం మూడు రెట్లు పెరిగిందని, తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఉన్నామని పేర్కొన్న గత సర్కార్.. తలసరి అప్పు గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

ఆ సమయంలోనే కేసీఆర్ ప్రభుత్వానికి ఆర్థిక శిక్షణ లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది. ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించిందని, రాబోయే ప్రభుత్వాలమీద మోయలేని భారాన్ని మోపిందని అప్పట్లోనే కాంగ్రెస్ సీరియస్ అయింది.

60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పనిని బీఆర్ఎస్ సర్కార్.. పదేళ్లలోనే చేసి చూపించామని మాజీ సీఎం కేసీఆర్ చాలా సార్లు గొప్పలు చెప్పుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం సంగతి ఎలా ఉన్నా.. అప్పుల భారం మాత్రం పదేళ్లలో పది రెట్లు పెరిగిపోయింది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ప్రజలపై తలసరి రుణభారాన్ని కేసీఆర్ ప్రభుత్వం మోపింది.

2021-22 సంవత్సరానికి గాను దేశంలోని అన్ని రాష్ట్రాలు చేసిన గ్యారెంటీ అప్పులకు సంబంధించిన వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే విడుదల చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫైనాన్స్ డాక్యుమెంట్ 2023-24 ప్రకారం దేశంలోనే ఉత్తరప్రదేశ్ అత్యధిక రుణాలు కలిగి ఉందని తెలిపింది. ఆ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ ఉండగా.. మూడో ప్లేస్ లో ఏపీ నిలిచింది. యూపీ అంటే పెద్ద రాష్ట్రం. జనాభాకు తగ్గట్లు అప్పులు, సంక్షేమ కార్యక్రమాలకు భారీగా నిధులు అవసరమవుతుంటాయి. అలాంటి యూపీతో పోటీ పడి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందన్నది పెద్ద ప్రశ్న.

తెలంగాణ ఆవిర్భావం నుంచి ఈ ఏడాది డిసెంబర్ 4 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా స్టేట్ డెవలప్‌మెంట్ లోన్స్ రూపంలో తీసుకున్న అప్పు, ప్రస్తుతం ఉన్న బకాయిలు కలిపి మొత్తం 4 లక్షల 2 వేల 684 కోట్లు. 25 ఏళ్లలో తీర్చేలా రుణం తీసుకున్నందున ఇకపైన వచ్చే ప్రభుత్వాలు 2045 వరకూ క్రమంగా తీర్చడం కంపల్సరీగా మారింది.

ఈ సమస్యకు సమాధానం ఏమిటి?

ఇప్పుడు తెలంగాణ సహా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం సృష్టించడమే మార్గం. ఈ అప్పులు వడ్డీలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ తీరాలంటే పన్నుయేతర ఆదాయాలను పొందడంలో సహాయపడటానికి Property monetisationను పరిశీలించాల్సిన అవసరం ఉందని రిజర్వ్ బ్యాంక్ రిపోర్ట్ లో తెలిపింది. నిరుపయోగంగా ఉన్న భూములు, ఆస్తులపై సమగ్ర సమీక్ష చేపట్టి, ఆదాయాన్ని సమకూర్చే పారిశ్రామిక ఎస్టేట్‌ లుగా మార్చడం లేదా పూర్తిగా విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమీకరించాలని రిజర్వ్ బ్యాంక్ recommend చేసింది.

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముందు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే బాధ్యత ఉంది. ఇది నిజానికి ఒక పెద్ద Challenge లాంటిది. అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక క్రమశిక్షణతో ఈ సవాళ్లను అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు.

.

.

.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News