Big Stories

BJP : బీజేఎల్పీ నేత ఎవరు? రాజాసింగ్ కే ఇస్తారా?

BJP : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ఇప్పుడు అందరి దృష్టి బీజేపీ శాసన సభా పక్షనేత ఎవరనే దానిపై పడింది. కానీ ఇప్పట్లో బీజేఎల్పీ నేత ఎన్నిక జరిగే అవకాశం కనిపించడం లేదు. బీజేపీ అధిష్టానం పార్లమెంట్ సమావేశాల్లో బిజీ బిజీగా ఉంది. ఆ సమావేశాలు జరిగిన తర్వాత బీజేఎల్పీ నేత ఎంపికపై దృష్టి సారించే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయాలు సేకరించి తర్వాత బీజేఎల్పీ నేతను ప్రకటిస్తారని తెలుస్తోంది.

- Advertisement -

గత అసెంబ్లీలో కూడా బీజేఎల్పీ నేత లేరు. తొలుత బీజేపీ తరఫున రాజాసింగ్ ఒక్కరే గెలిచారు. తర్వాత ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు, ఈటల రాజేందర్ గెలిచారు. అధికారికంగా బీజేఎల్పీ నేత లేకుండానే గత అసెంబ్లీ ముగిసిపోయింది. ఇప్పుడు బీజేపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుంది.. ఎవరికి అవకాశం ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది.

- Advertisement -

తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటూ బీజేపీ పెద్దలు ఎన్నికల ముందు పదేపదే స్పష్టం చేశారు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో బీజేపీ డీలా పడింది. పార్టీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ ను తప్పించడం మైనస్ అయ్యింది. దీంతో బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమైంది. తెలంగాణలో ఎన్నికల్లో కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచింది. కానీ ఉపఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్ రావు, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలవలంతో బీజేపీ బలం 3కి చేరింది.

2014 ఎన్నికల్లో బీజేపీ 5 స్థానాలు మాత్రమే గెలిచింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన మూడు ఎన్నికలను పరిశీలిస్తే..ఈసారే ఎక్కువ స్థానాలను కాషాయ పార్టీ కైవసం చేసుకుంది. అందుకే ఇప్పుడు బీజేఎల్పీ నేత ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించిన రాజాసింగ్ నే ఆ పదవి వరించే అవకాశం ఉంది. లేదంటే కామారెడ్డిలో కేసీఆర్ ను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డికి ఇస్తారా? అనే ఆసక్తి నెలకొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News