Ponnam Prabhakar: మంత్రి పొన్నం ప్రభాకర్ బలహీన వర్గాల రిజర్వేషన్ల విషయంలో.. స్పష్టమైన హామీ ఇచ్చారు. బలహీన వర్గాల నోటి కాడి ముద్ద లాగవద్దు అంటూ ఆయన ప్రతిపక్షాలకు సందేశం పంపారు. స్థానిక సంస్థల ఎన్నికలు 42 శాతం రిజర్వేషన్లతోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
రిజర్వేషన్లపై ప్రభుత్వం దృఢ సంకల్పం
పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, గతంలో EWS వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదన్నారు. ఈ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీల రాజ్యాంగబద్ధ హక్కులకు ఎలాంటి ఇబ్బంది కలిగించవు అని హామీ ఇచ్చారు.
కుల గణన సర్వే ఆధారంగా నిర్ణయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల సర్వే నిర్వహించిందని మంత్రి వివరించారు. ఆ సర్వే ఆధారంగా రాష్ట్రంలో ఏ వర్గం ఎంత ఉందో తెలుసుకొని, రిజర్వేషన్లను అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రత్యేక సబ్ కమిటీ వేసి, 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుని, చట్టసభల్లో చర్చించి అన్ని పార్టీల మద్దతు పొందామన్నారు.
తమిళనాడు ఉదాహరణ
ఇటీవల తమిళనాడులో కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడగా, రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నా రాష్ట్రాలు ఆ రిజర్వేషన్లను అమలు చేసుకోవచ్చని, కోర్టు తీర్పు వెలువరించిందని పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. దాని ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 9 ద్వారా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది అని చెప్పారు.
ప్రతిపక్షాలపై విమర్శలు
ఈ సందర్భంగా మంత్రి, బలహీన వర్గాల రిజర్వేషన్లపై.. ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రజల పక్షాన నిర్ణయం తీసుకుంటే.. దానికి అడ్డు పడవద్దు. మా నోటి కాడి ముద్దను లాగడానికి ప్రయత్నించవద్దు అని అన్నారు.
అలాగే గత 10 ఏళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ఎంతమందికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చారు? ఎంతమందికి 3 ఎకరాల భూమి ఇచ్చారు? అని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు కోసం పోరాడారని, కానీ గత ప్రభుత్వంలో వర్గాల అభ్యున్నతికి ప్రత్యేకమైన చర్యలు లేవని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read: గుంతకల్లులో దారుణం.. యజమాని నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న కాంగ్రెస్
సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ ఛాంపియన్ అని పొన్నం ప్రభాకర్ అన్నారు. రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి కట్టుబాటుతో ఉందని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తాం. ఇది కేవలం రాజకీయ రిజర్వేషన్ మాత్రమే కాదు, భవిష్యత్తులో విద్యా, ఉపాధిలో కూడా ఈ రిజర్వేషన్ల ప్రయోజనాలు వస్తాయి” అని హామీ ఇచ్చారు.