Musi River Floods: హైదరాబాద్ ను మూసీ ముంచెత్తింది. 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా మూసీకి భారీగా వరద రావటంతో పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. శుక్రవారం రాత్రి ఒక్కసారిగా భారీ వరద రావటంతో మూసానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. స్థానికులు కట్టుబట్టలతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేశారు. బాధితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పురానాపూల్ వద్ద మూసీ పొంగడంతో ఓ ఆలయం నీట మునిగింది. దీంతో ఓ పూజారి వరదలో చిక్కుకుపోయాడు. గుడిపైకి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పూజారికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
1908 సెప్టెంబర్ 27,28.. 117 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లో వరద విలయతాండవం చేసింది. మూసీ వరద ఉద్ధృతికి భాగ్యనగరం మునిగిపోయింది. అంతకు ముందు రెండ్రోజులుగా నగరంలో కురిసిన భారీ వర్షాలకు 1908 సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 11 గంటలకు మూసీ ఉప్పొంగింది. వరద నీరు గరిష్టానికి చేరుకుని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. 1908 సెప్టెంబర్ 27 రాత్రి 15.38 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో నగరం అతలాకుతలమైంది.
మూసీ నది వెడల్పు 700 అడుగులు కాగా.. వరదల సమయంలో కిలో మీటర్ కు పైగా చేరింది. అర్ధరాత్రి ఒక్కసారి వరదలు రావడంతో వందల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. హైదరాబాద్ చరిత్రలో 1908 మూసీ వరదలు తీవ్ర విషాదంలా మిగిలిపోయాయి.
పురానాపూల్ బ్రిడ్జి వద్ద 13 ఫీట్ల ఎత్తుతో మూసీ వరద పొంగిపొర్లుతోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ప్రభుత్వం అలర్ట్ చేసింది. హైడ్రా, జీహెచ్‌ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. డ్రోన్ల ద్వారా వరద బాధితులకు ఆహారం సరఫరా చేస్తున్నారు. బాధితులను రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో మూసీ పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. ఎంజీబీఎస్ బస్టాండ్ లోకి శుక్రవారం రాత్రి వరద నీరు చేరింది. వరద నీటిలో చిక్కుకున్న ప్రయాణికులను సహాయక సిబ్బంది రక్షించారు. ఎంజీబీఎస్ బస్టాండ్‌కు వెళ్లే రెండు వంతెనల పై నుంచి వరద నీరు పొంగి ప్రవహిస్తుంది. దీంతో బస్టాండ్ ఆర్టీసీ అధికారులు తాత్కాలికంగా మూసేశారు.
చాదర్ ఘాట్ వద్ద చిన్న వంతెనపై వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. దీంతో ఆ వంతెనపై నుంచి వాహన రాకపోకలను నిలిపేశారు. పక్కనున్న పెద్ద వంతెన పై నుంచి రాకపోకలు కొనసాగుతున్నాయి. మూసారాంబాగ్ వద్ద మూసీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో అంబర్‌పేట్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే రహదారిని అధికారులు తాత్కాలికంగా మూసేశారు. మూసారాంబాగ్ వంతెన పై 10 అడుగుల మేర మూసీ వరద నీరు ప్రవహిస్తుంది.
Also Read: Musi Floods: MGBS నుంచి బస్సుల రాకపోకలు నిలిపివేత..! ఏ బస్సు ఏ రూట్లో వెళ్తుందంటే..?
బాపూఘాట్ నుంచి ఉప్పల్ వరకు మూసీ ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. మూసానగర్, రసూల్ పురా, శంకర్ నగర్, వినాయక వీధి, చాదర్ ఘాట్ లో పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. మలక్ పేట్ లో సుమారు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.