Future City: రేపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయనుంది. ఫస్ట్ ఫేజ్ లో 9 జోన్లు ఉండే అవకాశం ఉంది.
ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా మార్చాలనే లక్ష్యంతో ఫ్యూచర్ సిటీ ప్రణాళికను రూపొందించారు. ఇప్పటికే హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు అదనంగా.. ఇది నాలుగో నగరంగా ఆవిర్భవించనుంది. రంగారెడ్డి జిల్లాలోని ముచర్ల ప్రాంతంలో (పాత ఫార్మా సిటీ ప్రాంతంలో) ఈ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే ‘తెలంగాణ రైజింగ్ 2047’ దూరదృష్టిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ ను రూపొందిస్తున్నారు.
ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలివే..
ఈ నగరంలో ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సిటీ, లైఫ్ సైన్సెస్, హెల్త్ జోన్, ఎడ్యుకేషన్ జోన్, స్పోర్ట్స్ హబ్ లాంటి తొమ్మిది ప్రత్యేక జోన్‌లు ఉంటాయి. ఇది నెట్ జీరో కార్బన్ సిటీగా, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటుంది. ఇందులో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, ప్రపంచంలోని ప్రముఖ విద్యా సంస్థల క్యాంపస్‌లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వంటివి ఏర్పాటు చేయనున్నారు.
రేపే ఫ్యూచర్ సిటీకి రేపే శంకుస్థాపన..
విమానాశ్రయానికి 200 అడుగుల రోడ్డు కనెక్టివిటీ, మెట్రో రైలు మార్గం, క్వాలిటీ విద్య, వైద్య సౌకర్యాలు ప్రధానంగా ఉంటాయి. ఈ శంకుస్థాపన ద్వారా ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ కమిషనరేట్, టీజీఐఐసీ (TGIIC) కార్యాలయ భవనాల నిర్మాణంతో పాటు, ఔటర్ రింగ్ రోడ్డు (ORR) నుంచి రీజనల్ రింగ్ రోడ్డు (RRR) ను కలిపే రేడియల్ రోడ్ల పనులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ALSO READ: Musi River Floods: 1908 సెప్టెంబర్ 27.. మూసీ ఉగ్రరూపం.. ఆ రోజు ఏం జరిగిందంటే?