PM Modi AP Tour: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏపీలో పర్యటించనున్నారు. అక్టోబర్ 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ముందుగా శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం కర్నూలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో కలిసి రోడ్‌షోలో పాల్గొంటారు. జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ప్రధాని మోదీ ఏపీకి రానుండడంతో ఈ పర్యటన కూటమి నేతలకు కీలకంగా మారింది.
అక్టోబర్ 16న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాప, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ప్రధాని పర్యటన వివరాలను మంత్రి నారా లోకేశ్ శాసనమండలి లాబీలో ఇతర మంత్రులు, ఎమ్మెల్సీలతో ప్రస్తావించారు. ఈ పర్యటనలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టం వచ్చే అవకాశం ఉంది.
ఏపీ ప్రభుత్వం జూన్ నెలలో విశాఖలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 15 వేల మందితో కలిసి ప్రధాని మోదీ యోగా చేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అయ్యింది. అంతకు ముందు మే 2న అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఏపీకి వచ్చారు. అమరావతిలో రూ.49,000 కోట్లతో చేపట్టే 74 పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
అమరావతి కార్యక్రంలో రూ.5028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులు, రూ.3620 కోట్లతో నిర్మించే 8 జాతీయ రహదారులు, 3 రైల్వే ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు ప్రధాని మోదీ. మొత్తంగా రూ.58,000ల కోట్ల విలువైన 94 పనులను అప్పట్లో మోదీ ప్రారంభించారు.
ప్రధాని మోదీ శుక్రవారం ఒడిశాలో పర్యటించారు. ఝార్సుగూడలో రూ.60,000 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. 26,700 గ్రామాలను అనుసంధానించడానికి స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన 97,500 BSNL 4G టవర్లను ప్రారంభించారు. సొంత టెలికాం పరికరాలను తయారుచేసుకునే స్వీడన్, డెన్మార్క్, దక్షిణ కొరియా, చైనా దేశాల సరసన భారత్ నిలించిందని ప్రధాని తెలిపారు.
బీఎస్ఎన్ఎల్ 4G ప్రాజెక్ట్ తో గతంలో టెలికాం సేవలు లేని 26,700 గ్రామాలను అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ తెలిపారు. వీటిలో ఒడిశాలో 2,472 ఉన్నాయని, దాదాపు రెండు మిలియన్ల మంది కొత్త ఖాతాదారులకు మొబైల్ కనెక్టివిటీ లభిస్తుందన్నారు.
Also Read: Musi River Floods: 1908 సెప్టెంబర్ 27.. మూసీ ఉగ్రరూపం.. ఆ రోజు ఏం జరిగిందంటే?
భారతదేశంలోని 4G నెట్‌వర్క్‌ను 5Gకి సులభంగా అప్‌గ్రేడ్ చేయవచ్చని మోదీ చెప్పారు. 4G టెక్నాలజీతో డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, గ్రామీణ వర్గాలకు సాధికారత కల్పించడం వైపు ఒక అడుగు పడిందన్నారు. సాంకేతికత కేవలం వేగం గురించి మాత్రమే కాదు, సాధికారత గురించి కూడా అని ప్రధాని మోదీ తెలిపారు.
టెలికాం విస్తరణతో పాటు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉన్నత విద్యలో కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ, యువత ఆకాంక్షలను బలోపేతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తుందన్నారు.