QNet Fraud: మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో దేశవ్యాప్తంగా వేలాది కోట్లు కొల్లగొట్టిన క్యూనెట్ మోసం కేసులో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కీలక నిందితున్ని అరెస్ట్ చేశారు. దుబాయ్ పారిపోవటానికి సదరు నిందితుడు రాగా పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. క్యూనెట్, విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌లో భాగస్వామి, ప్రమోటర్‌గా వ్యవహరించిన దిగ్విజయ్ సింగ్ కేసులో 11వ నిందితునిగా ఉన్నాడు. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న అతనిపై పోలీసులు కొంతకాలం క్రితం లుక్ సర్క్యులర్ జారీ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని ఉచ్ఛులోకి లాగి 10వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ-కామర్స్, బైనరీ బిజినెస్ మోడల్స్ పేర భారీ కమీషన్లు, కళ్లు చెదిరే లాభాలు, విదేశీ పర్యటనలు ఆశచూపి నిలువునా ముంచారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన 50 ఏళ్ల దిగ్ విజయ్ సింగ్ ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్ లో నివాసముంటున్నాడు. క్యూనెట్ నెట్ వర్క్‌లో కీలకమైన వీ పార్ట్ నర్ గా ఉన్నాడు. దుబాయ్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా నెట్ వర్క్ ను నడుపుతూ జనాన్ని మోసం చేయటానికి జూమ్ యాప్ వెబ్నార్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ప్రమోషన్లు జరిపాడు. ఢిల్లీలో అరెస్ట్ చేసిన దిగ్విజయ్ సింగ్ నుంచి పోలీసులు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఢిల్లీ కోర్టులో హాజరుపరిచి ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్ పై హైదరాబాద్ తీసుకొచ్చారు. ఈ భారీ మోసానికి సంబంధించిన నిధుల ప్రవాహం, ఇతర నిందితుల వివరాలు, క్రాస్-బోర్డర్ లింకుల వివరాలు తెలుసుకునేందుకు నిందితున్ని కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. పరారీలో ఉన్న మిగితా నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టు అధికారులు తెలిపారు.
Also read: తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?