AC Temperature: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల్లో ఎయిర్ కండిషనర్ల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సర్కారు ఆఫీసుల్లో ఏసీల ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు తగ్గించకూడదని స్పష్టం చేస్తూ ఇంధన శాఖ బుధవారం అధికారిక జీవో జారీ చేసింది. ప్రభుత్వ భవనాల్లో ఏసీల వాడకం వల్ల విద్యుత్ వినియోగం పెరిగిపోతోందని, దీన్ని నియంత్రించడం ద్వారా తక్షణ ఇంధన పొదుపు సాధించవచ్చని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి ‘నెట్ జీరో’ రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను రూపొందించింది. ఇందులో భాగంగా ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ సరికొత్త ఏసీ నిబంధనలను అమల్లోకి తెచ్చారు. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణ రెడ్కో వీసీ ఎండీ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
రూమ్ ఉష్ణోగ్రతను 25 డిగ్రీల సెల్సియస్ వద్ద స్థిరంగా ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గడమే కాకుండా, కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, వచ్చే ప్రజలకు అనుకూలమైన, ఆరోగ్యకరమైన ఇండోర్ వాతావరణం ఏర్పడుతుందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రత్యేక ఆపరేషనల్, ఫంక్షనల్ అవసరాలు ఉన్న కొన్ని విభాగాలకు మాత్రం మినహాయింపులు ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలను రాష్ట్రంలోని అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు, అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలోని కార్యాలయాల్లో కచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, సంస్థల సీఎండీలు కూడా ఈ నిబంధనల అమలును పర్యవేక్షించనున్నారు.
Also read: విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!