Chitti Murukulu Recipe: సండే ఈవెనింగ్ లేదా వర్షా కాలంలో వేడి వేడి టీ.. తాగుతూ ఏదైనా కర కరలాడేది తింటే.. ఆ మజాయే వేరు. అలాంటి టైమ్‌లో అందరికీ.. గుర్తుకు వచ్చే రెసిపీ ఈ చిట్టి మురుకులు. సైజులో చిన్నగా, చూడటానికి ఎంతో ముద్దుగా ఉండే ఈ మురుకులు పిల్లల లంచ్ బాక్స్‌లకు.. లేదా స్నాక్స్ బాక్స్‌లకు పర్ఫెక్ట్ ఛాయిస్. మార్కెట్లో దొరికే వాటికంటే.. మనం ఇంట్లోనే శుభ్రమైన నూనెతో వీటిని తయారు చేసుకోవడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఆలస్యం ఎందుకు, ఈ క్రిస్పీ మురుకులు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు , తయారీ విధానం ఏంటో చూసేద్దాం.
బియ్యం పిండి: 2 కప్పులు
పుట్నాల పప్పు పొడి: అర కప్పు
వాము: 1 టేబుల్ స్పూన్
కారం: 1.5 టేబుల్ స్పూన్లు
ఉప్పు: తగినంత
వెన్న లేదా వేడి నూనె: 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు: 1 చిన్న స్పూన్
నూనె: మురుకులు వేయించడానికి సరిపడా
1. ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో.. జల్లెడ పట్టిన బియ్యం పిండి, పుట్నాల పప్పు పొడి వేయాలి. దీనికి తగినంత ఉప్పు, కారం, వాము, నువ్వులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె లేదా కరిగించిన వెన్న వేసి.. పిండి మొత్తానికి పట్టేలా బాగా రుద్దాలి. ఆ తర్వాత కొద్ది కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండి గట్టిగా ఉంటే మురుకులు విరిగి పోతాయి. కాబట్టి మెత్తగా కలుపుకోవడం ముఖ్యం.
2. ఇప్పుడు మురుకులు లేదా జంతికలు వత్తుకునే చిన్న రంధ్రాలు ఉండే గొట్టాన్ని తీసుకోవాలి. దాని లోపలి భాగంలో.. కొద్దిగా నూనె రాయాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిలో నుండి కొద్దిగా పిండి తీసుకుని సిలిండర్ ఆకారంలో చేసి గొట్టంలో పెట్టుకోవాలి.
3. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడెక్కే లోపు ఒక ప్లాస్టిక్ కవర్ లేదా బట్ట మీద చిన్న చిన్న చక్రాలుగా ఈ పిండిని ఒత్తుకోవాలి. చిట్టి మురుకులు కాబట్టి చిన్న సైజులో.. గుండ్రంగా వత్తుకుంటే చూడటానికి అందంగా ఉంటాయి. వేయించడానికి ఈజీగా ఉంటుంది.
4. నూనె బాగా కాగిన తర్వాత.. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. ఇప్పుడు మనం వత్తుకున్న చిట్టి మురుకులను నెమ్మదిగా.. నూనెలో జారవిడవాలి. బాణీ పట్టేన్ని మురుకులు వేసుకోవచ్చు. వీటిని రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించాలి. నూనెలో బుడగలు తగ్గాక మురుకులు క్రిస్పీగా మారతాయి. అప్పుడు వాటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే..ఎంతో రుచి కరమైన,కర కరలాడే చిట్టి మురుగులు రెడీ.
Also Read: హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ పులావ్..క్షణాల్లోనే రెడీ అవుతుంది
పిండి కలిపేటప్పుడు నీళ్లకు బదులుగా మజ్జిగ వాడితే మురుకులు మరింత గుల్లగా వస్తాయి.
వామును చేతితో నలిపి వేస్తే.. మంచి వాసన వస్తుంది.
నూనె ఎప్పుడూ మీడియం వేడిలోనే ఉండాలి. లేదంటే మురుకులు పైకి మాడిపోయి లోపల ఉడకవు.
గాలి తగలకుండా.. ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాలో నిల్వ చేసుకుంటే ఇవి 15 నుంచి 20 రోజుల వరకు తాజాగా, కరకరలాడుతూ ఉంటాయి.
మీ ఇంట్లో కూడా ఈ ఈజీ చిట్టి మురుకులు ట్రై చేయండి, మీ కుటుంబ సభ్యులతో కలిసి వేడి వేడి టీతో ఎంజాయ్ చేయండి!