Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో : ఫ్రాన్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశంలో శాంతిభద్రతలను అస్థిరపరచాలని చూసే శక్తులపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
చారిత్రక భవనాల ధ్వంసంపై ఆందోళన
ఫ్రాన్స్‌లోని లిమోజెస్ నగరంలో దాదాపు 143 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన చారిత్రక టౌన్‌హాల్ ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో పూర్తిగా నేలమట్టమైంది. రెండు ప్రపంచ యుద్ధాల కష్టాలను కూడా తట్టుకుని నిలబడిన ఈ అపురూప కట్టడం, అల్లరి మూకలు పెట్టిన నిప్పు కారణంగా బూడిదైందని రాంచందర్ రావు తన ట్వీట్లో ఆవేదన వ్యక్తం చేశారు. సంస్కృతి, చారిత్రక ఆనవాళ్లను నాశనం చేసే ఉద్దేశంతోనే ఇటువంటి అరాచక శక్తులు దాడులకు తెగబడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత్‌లోనూ కుట్రపూరిత ఆలోచనలు
ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న ఈ పరిణామాలు భారత్‌కు కూడా ఒక హెచ్చరిక లాంటివని రాంచందర్ రావు పేర్కొన్నారు. మన దేశంలోనూ కొన్ని అరాచక శక్తులు ఇటువంటి అలజడిపూరిత వాతావరణాన్ని సృష్టించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు. దేశ ప్రజల ఐక్యతను, ప్రశాంతతను దెబ్బతీసేందుకు కొందరు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఆయన హెచ్చరించారు.
మోడీ నాయత్వంలో గట్టి హెచ్చరిక
ఎన్ని కుట్రలు పన్నినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయత్వంలో భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటువంటి అరాచక శక్తులకు తలొగ్గబోదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే వారి ఆటలు సాగవని తేల్చిచెప్పారు. దేశ ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ, శాంతిభద్రతలను కాపాడడంలో ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు