Ravindra Naik: స్వేచ్ఛ బ్యూరో : రాష్ట్ర ప్రజల సంపదను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సంబంధిత వ్యక్తుల ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అక్రమ సంపాదన, భూదోపిడీ జరిగినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే చట్ట ప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధికి వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాల్సి ఉంది..
తెలంగాణ ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, స్వయం పాలన, నీళ్లు, నిధులు, నియామకాల లక్ష్యాలతో ఎన్నో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ ఆకాంక్షలను గత పాలకులు దెబ్బతీశారని విమర్శించారు. స్వయం పాలన పేరుతో కుటుంబ పాలన సాగించారని, తెలంగాణ ప్రజల ఆశయాలకు విరుద్ధంగా పాలన కొనసాగించారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు చేసిన త్యాగాలు, యువత పోరాటాలు, నిరుద్యోగుల ఆశలు, రైతుల ఆకాంక్షలకు తగిన న్యాయం జరగాలంటే ప్రజల వనరులు ప్రజలకే ఉపయోగపడాలని ఆయన పేర్కొన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరాల్సి ఉందని అన్నారు.
ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలి..
రాష్ట్రం భవిష్యత్తులో ఎదుర్కొనే కరువు పరిస్థితులు, వాతావరణ మార్పుల ప్రభావం వంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి భారీగా నిధులు అవసరమని రవీంద్ర నాయక్ అభిప్రాయపడ్డారు. ప్రజాధనం దుర్వినియోగం, అక్రమ భూసేకరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వం తక్షణమే విచారణ చేపట్టాలని, అక్రమాలు నిర్ధారణ అయితే చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్వాధీనం చేసుకున్న ప్రజా సంపదను సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, పేదల సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలని సూచించారు.
బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు..
తెలంగాణ ఏర్పాటు వెనుక ఉన్న ప్రధాన ఆశయమైన ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య పాలనను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. అవినీతి, భూదోపిడీ ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకున్నప్పుడే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసే వారెవరైనా చట్టం ముందు జవాబుదారీగా ఉండాలని రవీంద్ర నాయక్ అన్నారు. కాళోజీ నారాయణరావు ప్రజాకవిత్వంలోని ప్రాంతీయ ఆత్మగౌరవ భావనను గుర్తుచేస్తూ, తెలంగాణ ప్రజల హక్కులకు భంగం కలిగించే వారిపై ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Also Read: కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు