Salar Jung: స్వేచ్ఛ బ్యూరో: గవర్నర్ శివప్రతాప్ శుక్లా అధ్యక్షతన హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌లో ఆదివారం నిర్వహించిన సాలార్ జంగ్ మ్యూజియం పాలక మండలి సమావేశంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం పాల్గొన్నారు. ఈ సమావేశంలో సాలార్ జంగ్ మ్యూజియం అభివృద్ధి, చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద పరిరక్షణ, మ్యూజియం ఆధునికీకరణ, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పన, విద్యా సంబంధిత కార్యక్రమాల విస్తరణ వంటి కీలక అంశాలపై చర్చించారు. మ్యూజియాన్ని మరింత అభివృద్ధి చేసి, ప్రజలకు సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు.
పాలక మండలి సమావేశం అనంతరం ఉపకులపతి ప్రొఫెసర్ కుమార్ మొలుగరం గవర్నర్ శివప్రతాప్ శుక్లాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువతను మానవతా సేవల్లో భాగస్వాములను చేయడం, స్వచ్ఛంద సేవా స్ఫూర్తిని పెంపొందించడం, ప్రజల్లో సామాజిక బాధ్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలని వివరించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో సహాయక చర్యలు, అత్యవసర సేవలు, స్వచ్ఛంద రక్తదానం, ప్రథమ చికిత్స శిక్షణతో పాటు నిరుపేదలు, బలహీన వర్గాలకు సహాయం అందించడంలో భారత రెడ్‌క్రాస్ సొసైటీ పోషిస్తున్న కీలక పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించారు. విద్యాసంస్థల సహకారంతో యువతలో మానవత్వం, కరుణ, సామాజిక బాధ్యత, నిస్వార్థ సేవాభావాన్ని పెంపొందించాల్సిన అవసరాన్ని చర్చించారు.
విద్య అనేది కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా, సమాజానికి సేవ చేసే బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దే సాధనంగా నిలవాలని ఈ చర్చలో ప్రధానంగా అభిప్రాయపడ్డారు. విశ్వవిద్యాలయాల ద్వారా యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయడం ద్వారా సమాజంలో సేవా దృక్పథాన్ని విస్తృతం చేయవచ్చనే అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్, ఇతర ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు, పాలక మండలి సభ్యులు, సీనియర్ పరిపాలనాధికారులు పాల్గొన్నారు.
Also read: కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు