Congress Meeting Dubbaka : దుబ్బాకకు రావాల్సిన నిధులు నాడు సిద్దిపేటకు కేసీఆర్ తరలించారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. దుబ్బాకలో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న ఆయన.. స్థానిక ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు నియోజకవర్గానికి ఏం చేశారని నిలదీశారు. ఈ ప్రాంత అభివృద్ధికి నిధులు తీసుకొచ్చారా అని నిలదీశారు. ఇక్కడ సమస్యలను శాసనసభలో ప్రస్తావించారా? అని ప్రశ్నించారు. దుబ్బాక ఉపఎన్నిక సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. ఈ ప్రాంతానికి పరిశ్రమలు, కేంద్రం నుంచి నిధులు తీసుకురాని రఘునందన్ రావుకు ఓట్లు అడిగే హక్కులేదని రేవంత్ తేల్చిచెప్పారు.
బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి.. పాతచింతకాయ పచ్చడిలాంటి వారేనని రేవంత్ విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు రెండుసార్లు ఎంపీగా గెలిపించినా.. ఆయన చేసిందేమిలేదన్నారు. దొర గడీ దగ్గర కాపాలా ఉండే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాకను ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర బంట్రోతు లాగే ఉన్నారని మండిపడ్డారు. దుబ్బాకకు పట్టిన శని కేసీఆర్ కుటుంబమని విమర్శించారు.
గతంలో చెరుకు ముత్యంరెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఎంతో నిజాయితీగా పనిచేశారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. నేడు ఆయన కుమారుడు, కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి తండ్రిలా పనిచేస్తారని ఓటర్లకు భరోసా ఇచ్చారు. అందుకే ఆయనను గెలిపించాలని కోరారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు గుర్తింపురాగానే వసూళ్లు మొదలుపెట్టారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అప్పుడు కొడుకు కేటీఆర్ ను అమెరికా నుంచి దించారన్నారు. నేడు వేల కోట్లకు కేసీఆర్ కుటుంబ పడగలెత్తిందన్నారు. లక్షకోట్లు మింగేశారని..10 వేల ఎకరాలు గుంజుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ బక్కోడుకాదు.. బకాసురుడని విమర్శించారు. కేసీఆర్ కుటుంబానికే బంగారు తెలంగాణ అయ్యిందన్నారు. పేదలకు బతుకులు మాత్రం బాగుపడలేదన్నారు. తెలంగాణను ఇందిరమ్మ రాజ్యం చేస్తామంటే మీకేంటి నొప్పిని కేసీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు.
.
.